లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీకి షాక్..కమలంతో మరో పార్టీ కటీఫ్

చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ, ఉపేంద్ర కుశ్వాహ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీలు కమలానికి కటీఫ్ చెప్పాయి. అటు శివసేన సైతం బీజేపీపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తోంది.

news18-telugu
Updated: January 8, 2019, 2:44 PM IST
లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీకి షాక్..కమలంతో మరో పార్టీ కటీఫ్
బీజేపీ చీఫ్ అమిత్ షా (ఫైల్ ఫొటో)
  • Share this:
లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీకి గట్టిషాక్ తగిలింది. కమలం పార్టీతో దోస్తీని మరో పార్టీ కటీఫ్ చేసుకుంది. అసోం ప్రభుత్వ నుంచి వైదొలుగుతున్నట్లు బీజేపీ మిత్రపక్షం అసోం గణపరిషత్ (AGP) సోమవారం ప్రకటించింది. పౌరసత్వం (సవరణ)బిల్లు-2016ని నిరసిస్తూ ఏజీపీ ఈ నిర్ణయం తీసుకుంది. పౌరసత్వం బిల్లుతో అసోం ప్రజల ఉనికి ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందని..ఆ బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేసినా బీజేపీ హైకమాండ్ పట్టించుకోలేదని వాపోయింది. తమకు అస్సామీ ప్రజల ప్రయోజనాల ముఖ్యమని.. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

అస్సాం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే గతంలో మేం బీజేపీతో చేతులు కలిపాం. కానీ ఆ ఒప్పందాన్ని బీజేపీ ఉల్లంఘించింది. పౌరసత్వం (సవరణ) బిల్లు -2016 ను లోక్‌సభలో ప్రవేశపెట్టి ఇరుపార్టీల అవగాహనకు తూట్లు పొడిచారు. ఆ చట్టంతో అస్సామీల ఉనికికి ప్రమాదం పొంచిఉంది. అందుకే మేం బీజేపీ ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నాం.
అతుల్ బోరా, ఏజీపీ చీఫ్
పౌరసత్వ చట్టం-1955కి సవరణలు చేస్తూ ఇప్పటికే లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చిన మైనార్టీలు (హిందువులు, సిక్కులు, బుద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లు) భారత్‌లో ఆరేడేళ్లుగా నివసిస్తుంటే..వారి వద్ద ఎలాంటి ప్రభుత్వ డాక్యుమెంట్లు లేకున్నా భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఐతే ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు..ముఖ్యంగా అసోంలోని చాలా వర్గాలు, సంస్థలు పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టంతో అస్సామీల సంస్కృతి, సంప్రదాయాలతో పాటు తమ ఉనికి దెబ్బతినే ప్రమాదముందని అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ప్రజల ఆందోళనకు మద్దతు ప్రకటించిన ఏజీపీ.. ఆ మేరకు కమలంతో కటీఫ్ చేసుకుంది.

126 స్థానాలున్న అసోం అసెంబ్లీలో బీజేపీ కూటమికి 86 సభ్యుల బలం ఉండేది. అందులో బీజేపీకి 60, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (BPF)కి 12, అసోం గణ పరిషత్ (AGP)కి 14 సీట్లు ఉన్నాయి. ఐతే బీజేపీ ప్రభుత్వానికి ఏజీపీ మద్దతు ఉపసంహరించుకున్నా.. వచ్చిన ఇబ్బందేం లేదు. బీజేపీ, బీపీఎఫ్ (60+12)కి కలిపి 72 మంది సభ్యులున్నారు. మ్యాజిక్ నెం.64 కన్నా 8 సీట్లు ఎక్కువగానే ఉన్నాయి. ఐతే ఎన్డీయే నుంచి బయటికొస్తుందా? లేదా? అనే దానిపై మాత్రం ఏజీపీ క్లారిటీ ఇవ్వలేదు.

ఇప్పటికే పలు పార్టీలు బీజేపీతో తెగదెంపులు చేసుకొని ఎన్డీయే నుంచి బయటకొచ్చాయి. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ, ఉపేంద్ర కుశ్వాహ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీలు కమలానికి కటీఫ్ చెప్పాయి. అటు శివసేన సైతం బీజేపీపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల ముందు మిత్రపక్షాలు ఝలకివ్వడం బీజేపీకి ఇబ్బందికరమేనన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.


First published: January 7, 2019, 6:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading