పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament winter session) సోమవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఉద్దేశాలు, లక్ష్యాలను వివరించి, సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలువురు కేంద్ర మంత్రులతోపాటు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కూడా భేటీలో పాల్గొంటారని వార్తలు వచ్చినా, ఆయనీ సమావేశానికి రాలేకపోయారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటన కారణంగా డుమ్మా కొట్టారు. ముఖ్యమైన ఇద్దరు నేతలు లేకుండా జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ లో ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడనీయలేదని విపక్షాలు ఆరోపించాయి. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఒక దశలో రచ్చకు దిగారు. సర్కారు తీరును నిరసిస్తూ ఆయన వాకౌట్ చేశారు. దీన్ని బట్టి పార్లమెంట్ సమావేశాల్లోనూ ఇదే సీన్ తప్పదనే సంకేతాలిచ్చినట్లయింది.
ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతోన్నవి కావడంతో ఈ పార్లమెంట్ సమావేశాలను మోదీ సర్కార్ ప్రతిష్టాత్మంగా భావిస్తూ, భారీ ఎత్తున బిల్లుల్ని సిద్ధం చేసింది. కానీ ఆల్ పార్టీ మీటింగ్ జరిగిన తీరు సభ సజావుగా జరుగుతుందనే నమ్మకాలను తగ్గించాయి. వివాదాస్పదంగా మారిన సాగు చట్టాలను రద్దు చేసిన కేంద్రం.. ఆ మేరకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టనుంది. సాగు చట్టాల రద్దు బిల్లులను తొలిరోజే సభలో పెట్టాలనుకుంటోన్న మోదీ సర్కార్.. వివిధ రంగాలకు సంబంధించి మొత్తం 26 బిల్లులను సిద్దం చేసింది. నవంబర్ 29న మొదలయ్యే శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23 వరకు సాగాల్సి ఉన్నా, విపక్షాల ప్రతిస్పందనను బట్టి లేదా కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిని బట్టి గడువు అటు ఇటయ్యే అవకాశాలు లేకపోలేవు.
గత పార్లమెంట్ సమావేశాలు సాగు చట్టాల వల్లే వృధా అయిపోగా, ఇప్పుడు అవే సాగు చట్టాల రద్దుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని, సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్ని పార్టీల నేతలను రిక్వెస్ట్ చేశారు. అయితే విపక్షాలు మాత్రం పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చట్టం తేవాల్సిందేనని, పెట్రో, నిత్యావసరాల ధరలు తగ్గించాలని, పెగాసస్ ఉదంతం తదితర అంశాలపై సభలో చర్చకు అనుమతించాలని పట్టుపట్టాయి. పశ్చిమ బెంగాల్ లో బీఎస్ఎఫ్ పరిధి విస్తరణపైనా సభలో చర్చ జరపాలని టీఎంసీ, ఇంకొన్ని పార్టీలు నినాదాలు చేశాయి.
అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, పియూష్ గోయల్ తోపాటు కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, ఆనంద్ శర్మ, టీఎంసీ నుంచి డెరిక్ ఒబ్రెయిన్, సుదీప్ బెనర్జీ, డీఎంకే నుంచి టీఆర్ బాలు, టి.శివ, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, టీఆర్ఎస్ తరఫున నామా నాగేశ్వరరావు, ఆప్ తరఫున ఎంపీ సంజయ్ సింగ్, టీడీపీ నుంచి కనకమేడల తదితరులు హాజరయ్యారు.
ఆల్ పార్టీ మీటింగ్ లో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని, విపక్ష నేతలను మాట్లాడనీయలేదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. మీటింగ్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆల్ పార్టీ మీటింగ్ లోనే విపక్షాల గొంతు నొక్కిన ప్రభుత్వం.. ఇక పార్లమెంటులోనూ అదే ధోరణి కొనసాగిస్తే అడ్డుకుంటామని సింగ్ అన్నారు. ఖర్గే మాట్లాడుతూ, అధిక దరలు, పెట్రో మంటలు, పంటకు కనీస మద్దతు ధర చట్టంపై చర్చ చేపట్టాలని కోరినట్లు తెలిపారు. మరోవైపు, మోదీ సర్కారుపై పోరులో కలిసి సాగాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నేతృత్వంలో ఇవాళ విపక్షాల ఉమ్మడి సమావేశం జరిగింది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి మమత నాయకత్వంలోని టీఎంసీ గైర్హాజరైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Parliament Winter session, Pm modi