కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ఎయిరిండియా విమాన ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఫోన్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలు, బాధితులకు సాయంపై ఆరా తీశారు. కోజికోడ్, మలప్పురం జిల్లాల కలెక్టర్లు సహాయక చర్యలు చేపడుతున్నారని సీఎం పినరయి విజయన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలిపారు. మరికొందరు అధికారులు కూడా సహాయకచర్యల్లో పాల్గొంటున్నట్టు చెప్పారు. ఐజీ అశోక్ యాదవ్ కూడా ఘటన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ దిగ్భ్రాంతికి గురయ్యారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు వెంటనే సహాయకచర్యల్లో నిమగ్నం కావాలని ఆదేశించారు. మంత్రి ఏసీ మొయిద్దీన్‌కు సహాయకచర్యల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. మంత్రి మొయిద్దీన్ త్రిసూర్ నుంచి ఘటన స్థలానికి బయలుదేరారు. కోజికోడ్, మలప్పురం జిల్లాలకు చెందిన ఫైర్, రెస్క్యూ బృందాలు సహాయకచర్యల్లో పాల్గొంటున్నాయి. విమాన ప్రమాదంపై సమగ్ర విచారణకు డీజీసీఏ ఆదేశించింది.
దుబాయ్ నుంచి కేరళలోని కాలికట్ (కోజికోడ్) వెళ్తున్న ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. ఈ విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది. రన్ వే మీద ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో విమానం ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. కోజికోడ్ ఎయిర్ పోర్టులో రన్ వే మీద నుంచి పక్కకి దూసుకుపోయింది. కేరళలో భారీ ఎత్తున వర్షం పడుతోంది. దీని వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తోంది.
‘దుబాయ్ నుంచి కాలికట్ (కోజికోడ్ ) వెళ్తున్న ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం IX 1344 విమానం కోజికోడ్ విమానాశ్రయంలో రన్ వే మీద రాత్రి 7.41 గంటలకు ప్రమాదానికి గురైంది. లాండింగ్ సమయంలో ఎలాంటి మంటలు అంటుకోలేదు. విమానంలో 174 మంది ప్రయాణికులు, 10 మంది పిల్లలు, ఇద్దరు పైలెట్లు, ఐదుగురు విమాన సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ప్రయాణికులను ఆస్పత్రులకు తరలించారు.’ అని విమానయానవర్గాలు ప్రకటించాయి.
Published by:Ashok Kumar Bonepalli
First published:August 07, 2020, 22:03 IST