Ahmed Patel: అహ్మద్ పటేల్... కాంగ్రెస్‌కి ట్రబుల్ షూటర్‌గా సేవలందించిన కీలక నేత

అహ్మద్ పటేల్ (File)

Ahmed Patel passes away: ఈ దేశానికి కొందరు నేతలు అవసరం. అలాంటివారిలో ఒకరైన కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుమూయడం విషాదకరం.

 • Share this:
  Ahmed Patel: ప్రతి పార్టీకీ మూల స్తంభాల్లాంటి నేతలు కొందరుంటారు. వారు గనుక లేకపోతే... ఆ పార్టీలో ఏదో లోటు స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి వారిలో మోస్ట్ సీనియర్ నేత అహ్మద్ పటేల్. సోనియా గాంధీకి రాజకీయ సలహాదారుగా... యూపీఏ హయంలో చక్రం తిప్పిన ఆయన... మిత్రపక్షాలతో చర్చించి విషయాలు కొలిక్కి తేవడంలో దిట్ట. ఒక రకంగా చెప్పాలంటే... ప్రణబ్ ముఖర్జీ తరువాత కాంగ్రెస్‌లో కష్టాలను తీర్చడంలో కీలక భూమిక పోషించారు. మాటిమాటికీ పార్టీలు మారే నేతలున్న ఈ రోజుల్లో... కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ ప్రయాణం సాగించి... అధికారంలో ఉన్నా, లేకపోయినా... అదే పార్టీలో కొనసాగుతూ... తుదిశ్వాస విడిచారు అహ్మద్ పటేల్. దేశంలో ఎంతో మందిని పొట్టనపెట్టుకున్న కరోనా వైరస్... ఈ మహానేతను కూడా తిరిగిరాని లోకాలకు తీసుకుపోవడం... కాంగ్రెస్‌కే కాదు... దేశానికీ తీరని లోటే. అక్టోబర్ 1న కరోనా బారిన పడిన అహ్మద్ పటేల్... 71 ఏళ్ల వయసులో... బుధవారం తెల్లవారు జామున... వివిధ అవయవాలు పనిచేయకపోవడంతో... ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు.


  కాంగ్రెస్ ట్రబుల్ షూటర్:
  ప్రస్తుతం అధికారంలో లేని కాంగ్రెస్‌లో ఎంతో మంది మోస్ట్ సీనియర్ నేతలున్నారు. వారిలో ఒకరైన అహ్మద్ పటేల్... బాబూ భాయ్, అహ్మద్ భాయ్‌గా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్‌లో అందరికీ పరిచయమే. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, నేతలు అలకపాన్పులు ఎక్కినప్పుడు, ఇతర పార్టీలతో సత్సంబంధాలు నెలకొల్పాల్సినప్పుడు... మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లాగే... అహ్మద్ పటేల్ కూడా ఆ బాధ్యత తీసుకునేవారు. 2008లో యూపీఏ నుంచి లెఫ్ట్ పార్టీలు వైదొలగినప్పుడు... అవిశ్వాస తీర్మానం నెగ్గేలా చెయ్యడంలో అహ్మద్ పటేల్ కీలక పాత్ర పోషించారు. తద్వారా పార్టీలో క్రైసిస్ మేనేజర్‌గా, ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందారు. ఎన్నో దశాబ్దాలుగా ఆ పార్టీలో మాస్టర్ వ్యూహకర్తగా ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. 1992 నుంచి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC)లో సభ్యుడిగా ఉంటున్న ఆయన... 1985-86లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి పార్లమెంటరీ సెక్రెటరీగా చేశారు.


  ఆగస్ట్ 21, 1949లో... గుజరాత్‌... బారుచ్ దగ్గర్లోని పిరమాన్ గ్రామంలో పుట్టారు ఆహ్మద్ పటేల్. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి... 8 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహంచారు అహ్మద్ పటేల్. బారుచ్ స్థానం నుంచి మూడుసార్లు లోక్ సభకు ఐదుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహంచారు. ఐతే... ప్రణబ్ తరహాలోనే ఈయన కూడా సొంత రాష్ట్రంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మోదీ హవాను అడ్డుకోలేకపోయారు. రచ్చ గెలిచినా ఇంట గెలవలేకపోయారు.

  గాంధీ ఫ్యామిలీతోనే ప్రయాణం:
  ప్రధానంగా గాంధీ ప్యామిలీకి... అత్యంత సన్నిహితుడు, నమ్మదగిన నేతగ అహ్మద్ పటేల్ గుర్తింపు పొందారు. కాంగ్రెస్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ నేతల్లో ఆయన ఒకరు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు... కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కావాలని అడిగనప్పుడల్లా... ఆయన సున్నితంగా తిరస్కరించేవారు. తద్వారా పదవులపై తనకు వ్యామోహం లేదనే సంకేతాలిచ్చారు.


  కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాజకీయ కార్యదర్శిగా 2001-2017 మధ్య సేవలందించారు అహ్మద్ పటేల్. ఆ సమయంలో... రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు అందుకున్నారు. తెరవెనక అహ్మద్ పటేల్... పార్టీలో కీలక నేతలు, కార్యకర్తల మధ్య అనుసంధానం ఉండేలా చర్యలు చేపట్టారు. యూపీఏ (UPA) అధికారంలో ఉన్న పదేళ్లలో ఎన్నో కీలక విధులు నిర్వహించిన అహ్మద్ పటేల్... ఎప్పుడూ లో ప్రొఫైల్ మెయింటేన్ చేశారు. ఆయన మీడియా ముందుకు వస్తే... జర్నలిస్టులు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేశేవారు. ఎందుకంటే... అహ్మద్ పటేల్ ఆసక్తికర విషయాలు చెప్పుతారనీ, వాటిని మిస్సవకూడదని భావించేవారు.

  పార్టీ విపత్కర సమయంలో:
  2018లో అహ్మద్ పటేల్‌ను పార్టీ ట్రెజరర్‌గా నియమించారు అప్పటి అధ్యక్షుడు రాహుల్ గాంధీ. అంతకు ముందు ఇదే పదవిని 1996 అక్టోబర్ నుంచి 2000 జులై వరకూ అహ్మద్ పటేల్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడంతో... నిధుల సమస్య బాగా ఉంది. ఇలాంటి సమయంలో పార్టీ దెబ్బతినకుండా అహ్మద్ పటేల్... ట్రెజరర్‌గా జాగ్రత్తగా వ్యవహరించసాగారు. ఇలాంటి సమయంలో ఆయన మరణం... పార్టీకి తీరనిలోటే. ఈమధ్య పార్టీలోని 23 మంది నేతలు... పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలు ఉండాలంటూ... హైకమాండ్‌పై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా బీహార్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పొందింది. ఇలాంటి సమయంలో అహ్మద్ పటేల్ మరణాన్ని పార్టీ సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
  Published by:Krishna Kumar N
  First published: