మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో కేంద్ర ఐటీ శాఖ దాడులు కలకలం సృష్టించాయి. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవే టార్గెట్ గా, ఆయన సన్నిహితులైన పార్టీ నేతల ఇళ్లలో శనివారం ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. ఎస్పీ కీలక నేత రాజీవ్ రాయ్, మనోజ్ యాదవ్ తోపాటు అఖిలేశ్ తో అనేక రకాల అనుంబంధం కలిగిన ఎస్పీ నేతలు పలువురి ఇళ్లు, కార్యాలయాలపై శనివారం ఐటీ దాడులుజరిగాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే దాడులు చేస్తున్నట్లు ఐటీ వర్గాలు చెప్పగా, ఎన్నికల ముందు బీజేపీ ఇలాంటి కుయుక్తులు పన్నుతుందని తాము ముందే ఊహించినట్లు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు..
కేంద్ర ఆదాయపన్ను విభాగం(ఐటీ) అధికారులు ఇవాళ సమాజ్‌వాదీ పార్టీ నేతలు రాజీవ్ రాయ్, మనోజ్ యాదవ్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తో ఆర్థిక కలాపాలు సాగిస్తోన్న పలువురు ఎస్పీ నేతల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. శనివారం ఉదయం మొదలైన ఈ సోదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పలు అవినీతి ఆరోపణలకు సంబంధించి ఫిర్యాదులు, ప్రాథమిక ఆధారాలు లభించడంతో సోదాలకు ఉపక్రమించినట్లు ఐటీ వర్గాలు పేర్కొన్నాయి. అఖిలేశ్ సీఎంగా ఉన్నప్పుడు ఎస్పీ ప్రభుత్వంలో జరగిన అవినీతి, అక్రమాలను వెలికి తీయడంలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
తన ఇంట్లో ఐటీ దాడులపై ఎస్పీ నేత రాజీవ్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని, నల్ల ధనం కూడా లేదని, ప్రతిపక్షంలో ఉంటూనే ప్రజలకు సేవ చేయడాన్ని ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతున్నదని, అందుకే ఐటీ దాడులు చేయిస్తోన్నదని ఆరోపించారు. ‘కచ్చితంగా నాపై ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి ఇరికించబోతున్నారు.. అదేంటో మీరే చూస్తారు..’అని రాయ్ వ్యాఖ్యానించారు. ఆర్సీఎల్ గ్రూపు ప్రమోటర్, అఖిలేశ్ యాదవ్ కు దగ్గరి వ్యక్తి అయిన మనోజ్ యాదవ్‌కు చెందిన ఆస్తులపైనా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మెయిన్‌పురిలోని మనోజ్ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి.
సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నేతలు పలువురు అవినీతికి పాల్పడ్డారంటూ వారి ఇండ్లలో ఇవాళ కేంద్ర ఐటీ విభాగం సోదాలు చేస్తుండటంపై ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఘాటుగా స్పందించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలపై కేంద్ర ఏజెన్సీలను ఉసిగొల్పి బెదరగొట్టడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. ఈ విషయంలో నాడు కాంగ్రెస్ చేసిన పనే నేడు బీజేపీ చేస్తున్నదని విమర్శించారు. ఐటీ దాడులను ముందే ఊహించామని, రాబోయే రోజుల్లో సీబీఐ, ఈడీ లాంటి సంస్థల నుంచి బెదింరింపులు వస్తాయని అఖిలేశ్ అన్నారు.
బీజేపీ గత ఎన్నికల సందర్భంగా యూపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని, ప్రస్తుతం మళ్లీ ఎన్నికల సమయం ఆసన్నం కావడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు సమాజ్‌వాది నేతలు, మద్దతుదారులపై సెంట్రల్ ఏజెన్సీలను ప్రయోగిస్తున్నదని అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. రాష్ట్రంలో రామరాజ్యం తీసుకొస్తామన్న హామీని బీజేపీ నిలబెట్టుకోలేకపోయిందన్న అఖిలేశ్.. లౌకికత్వంతోనే రామరాజ్యం సాధ్యమని, రామరాజ్యం రావాలంటే లౌకికత్వం కావాలని వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhilesh Yadav, IT raids, Samajwadi Party, Uttar pradesh, Uttar Pradesh Assembly Elections