వ్యవసాయంలో సంస్కరణలు తేవాలని గతంలో పలు పార్టీలు హామీలు ఇచ్చి విస్మరించాయి. 2019 సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలలో పేర్కొన్న అంశాలు ఇంచుమించు ఇలాగే ఉన్నాయి. పంజాబ్ ఎన్నికల సమయంలో ఆమాద్మీ పార్టీ కూడా ఇలాంటి హామీలనే ఇచ్చింది.
కొత్త వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు నెల రోజులకు పైగా ఢిల్లీ శివారులో వేలాది రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కొత్త చట్టాలను రద్దు చేసే వరకు ఆందోళనలను విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే రైతు సంఘాలు, కేంద్ర మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినా.. ఇంకా కొలిక్కిరాలేదు. కొత్త చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంటే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి మండలంలో దశాబ్ధాలుగా గుత్తాధిపత్యం చెలాయిస్తున్న దళారీ వ్యవస్థను కోరుకుంటున్నట్లే లెక్క.
రైతులు తమకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని దళారులకు ఎందుకు ఇవ్వాలి? రైతుల నుంచి ఈ కొత్త చట్టాలు ఎలాంటి అధికారాలు, హక్కులు, అవకాశాలను లాక్కోవు. పైగా కొత్త అవకాశాలను కల్పిస్తాయి. ఇప్పుడు చేస్తున్న ఆందోళనల వల్ల ఒరిగేమీ ఉండదు.
వ్యవసాయంలో సంస్కరణలు తేవాలని గతంలో పలు పార్టీలు హామీలు ఇచ్చి విస్మరించాయి. 2019 సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు ఇంచుమించు ఇలాగే ఉన్నాయి. దాదాపు కొత్త వ్యవసాయ చట్టాలనే పోలి ఉన్నాయి. పంజాబ్ ఎన్నికల సమయంలో ఆమాద్మీ పార్టీ కూడా ఇలాంటి హామీలనే ఇచ్చింది. రైతుల ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కల్పించాలని భారతీయ కిసాన్ కూడా ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తోంది. మరి అలాంటప్పుడు ఈ ఆందోళనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకోసం చేస్తున్నారు?
ఇలాంటప్పుడే ఒక ప్రశ్న నాలో కలుగుతుంది. వ్యవసాయ సంస్కరణలకు గతంలో రాజకీయ పార్టీలు, వ్యవసాయ సంఘాలు అంగీకారం తెలిపినప్పుడు అప్పటి ప్రభుత్వాలు ఎందుకు అమలు చేయలేదు.? దీని వెనక ఒక బలమైన కారణం కనిపిస్తుంది. మన దేశంలో దశాబ్ధాలుగా మండిలు, దళారుల వ్యవస్థలు ఉన్నాయి. స్థానిక రాజకీయాలతో ఈ వ్యవస్థకు బలమైన సంబంధాలున్నాయి. అందుకే మండిలను గానీ, దళారులను గానీ కదిపితే తమ పునాదులు కదులుతాయని రాజకీయ పార్టీలు భావిస్తూ వచ్చాయి. కానీ మోదీ ప్రభుత్వం రాజకీయ లాభనష్టాలను పక్కనబెట్టి రైతుల కోసం ఈ సంస్కరణలు తెచ్చింది.
ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న వారిలో చాలా మంది రైతుల సమస్యల గురించి లేవనెత్తడం లేదు. కొత్త చట్టాల గురించి చర్చించడం లేదు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అంటే వారు రైతుల కోసం పనిచేయడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈసారి వ్యవసాయ జీడీపీలో మెరుగైన వృద్ధి సాధించింది. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాయి. దేశంలో ట్రాక్టర్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. వీటన్నింటినీ పరిశీలిస్తే.. వ్యవసాయ రంగం అభివృద్ధి దిశలో పయనిస్తున్నట్లే లెక్క. అంతేకాదు సాధారణంగా రైతులు చేసే ఆందోళనలు కూడా కనుమరుగయ్యాయి. ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అలా జరగడం కొందరికి ఇష్టం లేదు. అందుకే కొత్త చట్టాలను అడ్డం పెట్టుకొని కొన్ని శక్తులు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.
కావాలని సృష్టించినవే..
రైతుల ఆందోళనలు కావాలని సృష్టించినవని నేను ఎందుకు అంటున్నాంటే.. మన దేశంలో ఇలాంటివి గతంలో చాలా సార్లు జరిగాయి. మనదేశ అంతర్గత వ్యవహారానికి సంబంధించి చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా.. అంతర్జాతీయంగా హైలైట్ చేస్తున్నారు. మన దేశం సంక్షోభంలో ఉందని చెప్పేందుకు కుట్రలు జరుగుతున్నాయి. నీట్ జేఈఈ ఆందోళనలు మీకు గుర్తున్నాయిగా..? అందులో స్వీడన్‌కు చెందిన పలువురు వ్యక్తులు జోక్యం చేసుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న రైతుల ఆందోళనలు కూడా అలా వచ్చినవే. లేదంటే 36 బ్రిటన్ ఎంపీలు మద్దతు తెలపడం ఏంటి? మన దేశ అంతర్గత విషయాల గురించి కెనడా ప్రధాని మాట్లాడడమేంటి?
రైతుల ఆందోళనలను నడిపిస్తున్నదెవరు? వీటితో లాభ పడేదెవరు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలి. రైతుల ఆందోళనల్లో మనకు ఎక్కువగా సుత్తి, కొడవలి బ్యానర్లే కనిపిస్తున్నాయి. అంటే వామపక్షాలు దీని వెనక ఉన్నాయి. మనదేశంలో సగం మందికి పైగా జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. ఒకవేళ రైతులకు నిజంగానే ఒక రాజకీయ వేదిక కావాలనుకుంటే.. వారు కమ్యూనిస్టులను ఆశ్రయిస్తారా? మన దేశంలో ఎన్నో ఏళ్ల క్రితమే కమ్యూనిస్ట్ పార్టీలకు కాలం చెల్లింది. అలాంటప్పుడు రైతులు ఎందుకు వారి వద్దకు వెళ్తారు?
మన దేశంలో 60 కోట్ల మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. ఆ జనాభాతో పోల్చుకుంటే ఇప్పుడు ఆందోళనలు చేస్తున్న వారి సంఖ్య చాలా తక్కువ. ఒకవేళ కొత్త చట్టాలతో ప్రమాదముంటే ఈ 60 కోట్ల మందీ ఆందోళనలు చేస్తారు. అప్పుడు దేశంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారేవి. కానీ 7 నెలల క్రితం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కేవలం 10వేల మందే ఆందోళనలు చేస్తున్నారు. అది కూడా ఒక్క రాష్ట్రం నుంచే. ఈ 10వేల మందే దేశంలోని రైతులందరికీ ప్రాతినిధ్యం వహించలేరు. అది అసాధ్యం. కానీ పేపర్లలో ఖాళీని నింపేంత మంది మాత్రం ఉన్నారు. అందుకే ఇంత రచ్చ జరుగుతోంది.
మరి ఈ ఆందోళనల వలన ఎవరికి లాభం కలుగుతుంది? అంటే చైనా అనే అంటాను. మనదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నందున ప్రపంచ దేశాలు మనకు ఎంతో గౌరవాన్ని ఇస్తాయి. చైనా కంటే మనల్నే ఎక్కువగా విశ్వసిస్తాయి. భారత్‌లో భిన్నాభిప్రాయలకు తావు లేదని, ప్రభుత్వం అణగదొక్కుతోందని చెప్పేందుకే డ్రాగన్ కుట్రలు చేస్తోంది. ఒక్క చైనాలోనే కాదు భారత్‌లోనూ నియంతృత్వ పాలన ఉందని ముద్ర వేసేందుకే ఇలా చేస్తోంది. తద్వారా మన దేశంలోని ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడుతోంది. చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న భారత కమ్యూనిస్టులు దీని వెనక ఉన్నారు. అందుకే ఇవి రైతులు స్వచ్ఛందంగా చేస్తున్న ఆందోళనలు కావు. కావాలని సృష్టించినవి.
(ఈ ఆర్టికల్ రాసిన రచయిత మ్యాథమెటీషియన్, కాలమిస్ట్. అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం )
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.