భారత త్రివిధ దళాల్లోకి రెగ్యులర్ నియామకాలను రద్దుచేస్తూ, ఇకపై నాలుగేళ్ల కాంట్రాక్టు పద్ధతిలో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చేలా కేంద్రం కొత్తగా ‘అగ్నిపథ్’ పథకాన్ని (Agnipath scheme) తీసుకొచ్చింది. అయితే, దీనిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత తీవ్రస్థాయి నిరసనలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆర్మీ అభ్యర్థులు ఇవాళ (సోమవారం) భారత్ బంద్ (Bharat Bandh)కు పిలుపునిచ్చారు.
కేంద్రం వెంటనే అగ్నిపథ్ ను రద్దు చేసుకొని, ఆర్మీలో ఉద్యోగాల భర్తీని చేపట్టాలనే డిమాండ్ తో పలు రాష్ట్రాల అభ్యర్థులు నేను (జూన్ 20) భారత్ బంద్ తలపెట్టారు. అయితే ఈ బందుకు ఎలాంటి అనుమతి లేదని కేంద్రం, అన్ని రాష్ట్రాల పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. బంద్ పేరుతో ఎవరైనా రోడ్డెక్కితే కఠిన సెక్షన్ల కింద కేసులు పెడతామని హెచ్చరించారు.
అగ్నిపథ్ పథకం వ్యతిరేక నిరసనల్లో దాదాపు 12 రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ ఆస్తులను ఆందోళనకారులు ధ్వంసం చేసిన నేపథ్యంలో నేటి భారత్ బంద్ పిలుపును భద్రతా బలగాలు సవాలుగా తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా రైల్వేల్లో హైఅలర్ట్ కొనసాగుతున్నది. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వ కార్యాలయాల వద్ద సెక్షన్ 144 అమలులో ఉంది. నిరసనకారులు చొరబడకుండా అన్ని రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచారు.
అగ్నిపథ్ పై పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నా.. ఆ పథకాన్ని రద్దు చేయబోమని కేంద్రం, త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఇకపై సాధారణ నియామకాలు ఏవీ ఉండబోవని, అగ్నిపథ్ పథకం ద్వారా కాంట్రాక్టు పద్ధతిలోనే భర్తీలు చేస్తామని ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు కుండబద్దలు కొట్టారు. త్వరలోనే ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. కాగా, అగ్నిపథ్ పథకాన్ని సమర్థించుకునేందుకు బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
అగ్నివీరులకు బట్టలుతకడం, కటింగ్ చేయడం వంటి పనులు నేర్పుతామని, సైన్యం నుంచి బయటకువచ్చాక వారికి ఈ నైపుణ్యాలు ఉపయోగపడుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించగా, బీజేపీ ఆఫీసులో సెక్యూరిటీ గార్డులుగా అగ్నివీరులకే ప్రాధాన్యం ఇస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ అన్నారు. దీంతో అగ్నిపథ్ కార్యక్రమం వెనుక అసలు ఉద్దేశాన్ని విజయవర్గీయ తేటతెల్లం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. అగ్నిపథ్ ను వెనక్కి తీసుకోవాలంటూ బీజేపీయేతర పార్టీలన్నీ నిరసనలు చేస్తున్నాయి. అయితే ఆ పార్టీలేవీ నేటి భారత్ బంద్ కు మద్దతు పలకలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.