news18-telugu
Updated: November 20, 2020, 4:07 PM IST
పార్లమెంటు భవనం
యంత్రాలతో మ్యాన్‌హోల్స్‌ను, సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరిచేందుకు కార్మికులకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చేతులతో మ్యాన్‌హోల్స్‌ను శుభ్రపరిచే విధానానికి (మాన్యువల్ స్కావెంజింగ్) స్వస్తి పలకాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి నుంచి సెప్టిక్ ట్యాంకులు, మురుగునీటి కాలువలను ఆటోమేటెడ్ క్లీనింగ్ పద్ధతుల ద్వారా మాత్రమే శుభ్రపరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారతదేశంలో నాగరికత ప్రారంభమైనప్పటి నుంచి వ్యర్థ్యాలను చేతులతోనే తీసివేసే అలవాటు ఉంది. ఈ అనాగరిక పద్ధతులకు ముగింపు పలకాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మాన్యువల్ స్కావెంజర్ పద్ధతులను పూర్తిగా నిషేధించడనికి, వారికి ఉపాధి, పునరావాసం కల్పించడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ మ్యాన్యువల్ స్కావెంజర్స్ అండ్ రిహ్యాబిలిటేషన్ (PEMSR) చట్టానికి సవరణలు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా గురువారం కొత్త నిర్ణయాలను ప్రభుత్వం ప్రకటించింది.
సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్కొత్త ప్రోత్సాహకాల్లో భాగంగా పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Urban Affair) ‘సఫాయిమిత్ర సురక్షా ఛాలెంజ్’ను ప్రారంభించింది. మ్యాన్యువల్‌గా కాకుండా సెప్టిక్ ట్యాంక్, డ్రైనేజీలు, మ్యాన్‌హోల్స్‌ను యంత్రాల సాయంతో శుభ్రపరచాలనే నినాదంతో ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా శుభ్రపరిచే యంత్రాలను కొనుగోలు చేయడానికి కార్మికులకు మంత్రిత్వ శాఖ నిధులు మంజూరు చేస్తుంది. "కార్మికులు ఈ యంత్రాలను సొంతం చేసుకోవాలని కోరుతున్నాం. వీటిని మున్సిపాలిటీలు అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు" అని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.
మ్యాన్‌హోల్ కాదు, మెషిన్ హోల్
ఇప్పటి నుంచి మ్యాన్‌హోల్‌కు బదులు మెషిన్ హోల్ అనే పదాన్ని అధికారిక వాడుక భాషలో చేర్చి, కార్మికుల గౌరవాన్ని కాపాడాలని మంత్రి పేర్కొన్నారు. PEMSR చట్టం కింద నిర్ణీత పద్ధతి పాటించకుండా లెట్రిన్లను నిర్మించడం, వాటి నిర్వహణపై నిషేధం ఉంది. డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంకులను మాన్యువల్ స్కావెంజింగ్ పద్ధతిలో శుభ్రపరిచే ఉద్యోగాలను కూడా చట్టం నిషేధిస్తుంది. డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంకులను ప్రమాదకరంగా, మ్యాన్యువల్‌గా చేతులతో శుభ్రపరచడం కోసం ఏవరైనా ఒక వ్యక్తి లేదా ఏజెన్సీ పారిశుద్ధ్య కార్మికులను తీసుకెళ్తే కఠినమైన శిక్షలు విధిస్తారు. ఈ చట్టం కింద ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ.5 లక్షల వరకు జరిమానా, లేదా రెండు శిక్షలూ కలిపి విధించే అవకాశం ఉంది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 20, 2020, 4:06 PM IST