వరుస భూకంపాలు ఉత్తరాది రాష్ట్రాలను భయపెడుతున్నాయి. నేపాల్ (Nepal Earthquake) లో భారీ భూకంపం సంభవించిన కొన్ని గంటల్లోనే ఉత్తరాఖండ్ (Uttarakhand Earthquake)లో కూడా భూమి కంపించింది. బుధవారం ఉదయం 6.27 గంటల ప్రాంతంలో పితోర్‌గఢ్‌లో భూప్రకంపనలు సంభవించడంతో.. ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ (NCS) ప్రకారం.. భూమికి 5 కి.మీ. లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్ర రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో నమోదయిందని అధికారులు వెల్లడించారు. రాత్రి నేపాల్‌ను భారీ భూకంపం వణికించడం.. అది జరిగిన కొన్ని గంటల్లోనే నేపాల్ (Nepal) సరిహద్దులో ఉన్న పితోర్‌గఢ్ జిల్లాలో మళ్లీ భూమి కంపించడంతో.. అక్కడి ప్రజల్లో టెన్షన్ నెలకొంది.
Earthquake of Magnitude:4.3, Occurred on 09-11-2022, 06:27:13 IST, Lat: 29.87 & Long: 80.49, Depth: 5 Km ,Location:Pithoragarh, Uttarakhand, India for more information download the BhooKamp App https://t.co/sqJqVcicEU @Indiametdept @ndmaindia @moesgoi @Dr_Mishra1966 @PMOIndia pic.twitter.com/4OnA0HmHDJ
— National Center for Seismology (@NCS_Earthquake) November 9, 2022
మంగళవారం అర్ధరాత్రి దాటాక నేపాల్‌లో భారీ భూంకంపం సంభవించింది. బుధాకోట్ ప్రాంతానికి 3 కి.మీ దూరంలో.. భూమికి 10 కి.మీ. లోతులో భారీ భూంకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6 గా నమోదైనట్లు వెల్లడించింది. యునైటెడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే (USGS) మాత్రం 5.6 తీవ్రత నమోదయినట్లు తెలిపింది. నేపాల్ భూకంపం ధాటికి భారత్‌లోనూ పలు చోట్ల భూమి కంపించింది. ఢిల్లీ , యూపీ, బీహార్ , ఉత్తరాఖండ్ ,మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి. దాదాపు 30 సెకన్ల పాటి భూమి కంపించడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మనదేశంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ.. నేపాల్‌లో మాత్రం కొంత నష్టం కలిగింది.
భూకంప ప్రభావంతో నేపాల్‌లో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు. దోతి జిల్లాలో కొన్ని చోట్ల ఇళ్లు కూలిపోయాయి. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది.
మంగళవారం రాత్రి కూడా భూమి కంపించింది. రాత్రి 8.52 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.9గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం ఉత్తరాఖండ్, నేపాల్ సరిహద్దులో ఉంది. ఈ భూకంపం కూడా భూమికి 10 కి.మీ. లోతులో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. వరుసగా మూడుసార్లు భూమి కంపించడంతో పాటు నేపాల్‌తో పాటు ఆ దేశ సరిహద్దులో ఉన్న ఉత్తరాఖండ్ ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Earth quake, Earth Tremors, Earthquake, Uttarakhand