Yogi Adityanath: జ్ఞానవాపి మసీదు విషయంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్(UttarPradesh)సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాత కాశీ నగరం మేల్కొన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత మథుర, బృందావన్, వింధ్యవాసిని ధామ్, నైమిశారణ్య ధామ్ వంటి ఆలయలు కూడా తెరపైకి వస్తున్నాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అదివారం లక్నోలో జరిగిన యూపీ బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జ్ఞాన్వాపి మసీదు వివాదంలో న్యాయపరమైన చర్యలు కొనసాగుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవల పునరుద్ధరించిన కాశీ విశ్వనాథ్ ఆలయానికి ప్రతిరోజూ సుమారు లక్ష మంది సందర్శకులు వస్తున్నారని యోగి అన్నారు. ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా నగరం తన పేరు ప్రాముఖ్యతను రుజువు చేస్తోందని ఆయన అన్నారు. యూపీలో బీజేపీ పాలనలో ఒక్క మత హింస కూడా జరగలేదని, రాష్ట్రంలో బలమైన శాంతిభద్రతల పరిస్థితికి ఇది అద్దం పడుతోందని యోగి అన్నారు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతిని శాంతియుతంగా నిర్వహించామని తెలిపారు. యోగి మాట్లాడుతూ...""రామనవమి, హనుమాన్ జయంతి వేడుకలు శాంతియుతంగా జరిగాయి. మొదటిసారి రంజాన్ సందర్భంగా చివరి శుక్రవారం రోడ్లపై నమాజు జరగలేదు. అనవసర శబ్దం నుంచి ఎలా విముక్తి కల్పించామో (మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు తొలగించడం) మీరు గమనించాలి. కాశీ విశ్వనాథ్ మందిర కారిడార్‌ను ప్రారంభించుకున్నాం. లక్ష మంది భక్తులు ఒకేసారి దర్శించుకునే అవకాశం ఇప్పుడు లభించింది. రామ మందిర నిర్మాణం తర్వాత కాశీ నగరం మేల్కొంటోంది. మథుర, బృందావనం వంటి తీర్థక్షేత్రాలు మేల్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో మనమంతా మరోసారి ముందడుగు వేయాలి"అని అన్నారు.
ఇక యూపీలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడం పట్ల సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. 2024 లోక్ సభ ఎన్నికలకు తక్షణమే కార్యాచరణను ప్రారంభించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 80 లోక్ సభ స్థానాలకు గాను కనీసం 75 స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యంతో పార్టీ ముందుకు సాగాలని యోగి అన్నారు. ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో ఇందుకోసం సన్నద్ధమవ్వాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.