‘అయోధ్య’ పూర్తైంది.. ప్రధాని మోదీ మరో సంచలన నిర్ణయం..

Uniform Civil Code : భారతదేశంలో ఉన్న ప్రతీ ఒక్కరికి ఒకే విధమైన చట్టం వర్తించేలా యునిఫాం సివిల్ కోడ్‌ను తీసుకురావాలని మోదీ సర్కారు భావిస్తోంది.

news18-telugu
Updated: November 12, 2019, 12:53 PM IST
‘అయోధ్య’ పూర్తైంది.. ప్రధాని మోదీ మరో సంచలన నిర్ణయం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నోట్ల రద్దు.. ట్రిపుల్ తలాఖ్ రద్దు.. ఆర్టికల్ 370 రద్దు.. హిందువులకు అయోధ్య.. ఇలా సంచలనాలతో దేశ పాలనలో తనదైన ముద్ర వేస్తున్న ప్రధాని మోదీ.. మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారా? దశాబ్ధాలుగా ఉన్న ఓ డిమాండ్‌ను తీర్చాలన్న యోచనలో ఉన్నారా? అంటే.. తాజా సమాచారం అవుననే చెబుతోంది. అదే.. ఉమ్మడి పౌరస్మృతి - యునిఫాం సివిల్ కోడ్. ప్రస్తుతం దేశంలో కొన్ని చట్టాలు మత ప్రాతిపాదికన అమలు చేస్తున్నారు. అయితే.. భారతదేశంలో ఉన్న ప్రతీ ఒక్కరికి ఒకే విధమైన చట్టం వర్తించేలా యునిఫాం సివిల్ కోడ్‌ను తీసుకురావాలని మోదీ సర్కారు భావిస్తోంది. ఈ శీతాకాల సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి.. చట్టం చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సదానందగౌడ.. కేంద్రం దీనిపై దృష్టిసారించిందని వెల్లడించారు. వాస్తవానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఉమ్మడి పౌరస్మృతిని సమర్థించారు. కానీ.. అప్పటి హిందూ, ముస్లిం నేతలు దాన్ని ప్రతిఘటించారు. దీంతో దాన్ని పక్కనపెట్టేశారు.

ఇప్పుడు మోదీ సర్కారు దాన్ని తెరపైకి తీసుకువస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రులు యునిఫాం సివిల్ కోడ్ గురించి వ్యాఖ్యానిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పలు సార్లు సుప్రీం కోర్టు ఉమ్మడి పౌరస్మృతి తేవాలని కేంద్రానికి సూచించిందని.. కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదని చెబుతున్నారు. ఈ సమయంలో మోదీ సర్కారు యునిఫాం సివిల్ కోడ్‌ను తీసుకొస్తే మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లే లెక్క. అదీకాక... ఇది ఆరెస్సెస్ చిరకాల వాంఛ కూడా. కాగా, ప్రస్తుతం గోవాలో ఉమ్మడి పౌరస్మృతి కొనసాగుతోంది. దానివల్ల అక్కడ అన్నింటా ఒకే చట్టం వర్తిస్తోంది. అన్ని ఆస్తులకు భార్యాభర్తలు ఇద్దరూ సమాన హక్కుదారులు.

యునిఫాం సివిల్ కోడ్ అంటే..

మతపరమైన సంప్రదాయాలతో సంబంధం లేకుండా దేశంలోని ప్రజలందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత, జీవన భృతి, మనోవర్తి, భరణం.. ఇతర అన్ని అంశాల్లో కులాలు, మతాలకు అతీతంగా ఒకే చట్టం అమలవుతుంది. హిందూ వివాహ, వారసత్వ, షరియా చట్టాలేవీ ఉండవు. అందరికీ సమానంగా ఒకే చట్టం వర్తిస్తుంది.

First published: November 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>