మనలో చాలా మంది ప్రభాస్ నటించిన సాహా, షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమాలు చూసే ఉంటాం. అందులో హీరోలు జెట్ ప్యాక్ సూట్ ధరించి విలన్లు రఫ్ఫాడిస్తారు. ఇప్పుడు అలాంటి జెట్స్ నే మన ఆర్మీ కోసం తయారు చేశారు. అది కూడా మన దేశానికి సంబంధించిన ఓ స్టార్టప్ కంపెనీ. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఇండియా (India) ఎక్కువగా ఆయుధాలు, ఆర్మీ వెహికల్స్ వంటి వాటి కోసం ఇతర దేశాలపై ఆధారపడేది. కొన్ని సంవత్సరాలుగా భారత ప్రభుత్వం (Indian Government) స్వదేశంలోనే ఆయుధాలు తయారు చేసేలా చర్యలు తీసుకుంటోంది.
మేక్ ఇన్ ఇండియా (Make In India) తరహా పథకాలతో డిఫెన్స్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్‌ను ప్రోత్సహిస్తోంది.ఈ విభాగంలో సాధించిన పురోగతిని ప్రదర్శించేందుకు ఏరో ఇండియా షోని ఓ అవకాశంగా భావిస్తుంది. సోమవారం ఏరో ఇండియా ఎగ్జిబిషన్ 14వ ఎడిషన్ ప్రారంభమైంది. ఈ షోకి సంబంధించిన ప్రత్యేక అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
* ప్రధాన ఆకర్షణగా జెట్‌ప్యాక్
ఆసియాలోనే అతిపెద్ద ఏరో షోగా గుర్తింపు పొందిన ఏరో ఇండియా బెంగళూరులోని యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో జరుగుతోంది. ఈ ఈవెంట్‌లో భారతదేశ స్వదేశీ రక్షణ పరికరాలు, ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుత కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసిన జెట్‌ప్యాక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
సాయుధ దళాల కోసం ఈ జెట్‌ప్యాక్‌ను రూపొందించింది. చాలా మంది భవిష్యత్తులో ఈ జెట్‌ప్యాక్‌లను రెస్క్యూ ఆపరేషన్‌లు, అర్బన్ ఆగ్మెంటెడ్ కంబాట్, హిట్-అండ్-రన్ రైడ్ వంటి వాటికి ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. భారతదేశం కూడా తన సొంత బ్యాచ్ జెట్‌ప్యాక్‌లను కొనుగోలు చేయాలని చూస్తోంది.
* 48 జెట్‌ప్యాక్ సూట్‌ల కోసం RFP జారీ చేసిన ఇండియా
గత నెలలో రక్షణ మంత్రిత్వ శాఖ 'బై ఇండియన్' కేటగిరీ కింద ఫాస్ట్ ట్రాక్ ప్రొసీజర్ (FTP) ద్వారా అత్యవసరంగా 48 జెట్‌ప్యాక్ సూట్‌లు కావాలిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(RFP) పెట్టింది. RFP ప్రకారం.. జెట్‌ప్యాక్‌లు మైదానాలు, పర్వతాలు, ఎడారులు, ఎత్తైన ప్రాంతాల్లో 3,000 మీటర్ల ఎత్తు వరకు పనిచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఆయా కంపెనీలకు ప్రతిపాదనలు సమర్పించేందుకు ప్రభుత్వం ఫిబ్రవరి 17 వరకు గడువు ఇచ్చింది. జెట్‌ప్యాక్ తయారీలో స్వదేశీ భాగాలు తప్పనిసరిగా 60 శాతం కంటే ఎక్కువ లేదా సమానంగా ఉండాలి. గరిష్టంగా కనీసం 50 km/h వేగం అందించాలని, పేలోడ్ సామర్థ్యం కనీసం 80kg ఉండాలని పేర్కొంది.
* కొత్త జెట్‌ప్యాక్ స్పెసిఫికేషన్లు
బెంగళూరు అబ్సొల్యూట్ కాంపోజిట్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన జెట్‌ప్యాక్ సూట్ వెనుక టర్బో ఇంజిన్‌తో సహా ఐదు ఇంజిన్‌లు ఉన్నాయి. సూట్ మూడు కిలోగ్రాముల బరువు ఉంది. 80 కేజీల బరువున్న సైనికులను మోయగలదు. 10 నిమిషాల్లో 10 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఉంది. మరింత మైలేజీ అందించడంపై పరిశోధన కొనసాగుతోంది. ప్రకృతి వైపరీత్యాలు, కొండచరియలు విరిగిపడటం, అగ్ని ప్రమాదాలు, భవనం కూలిన సమయాల్లో సైనిక ఆపరేషన్‌లకు ఈ సూట్ ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.
దీనిని డ్రోన్‌గా, నదులను దాటడానికి హెలికాప్టర్‌గా లేదా విరిగిన వంతెనలను దాటడానికి ఉపయోగించవచ్చని తెలిపింది. కంపెనీ ప్రకారం.. జెట్ సూట్‌లో 70 శాతం స్వదేశీ భాగాలు ఉన్నాయి. మొత్తం స్వదేశీ కంటెంట్ ఉపయోగించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది గ్యాస్ టర్బైన్ ద్వారా శక్తిని పొందుతుంది. గంటకు 50 కిలోమీటర్ల గరిష్ట వేగంతో 10 నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు సైనికుడిని తీసుకెళ్లగలదు.
* ఆర్మీకి త్వరలో ప్రదర్శన ఇస్తాం
అబ్సొల్యూట్ కాంపోజిట్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాఘవరెడ్డి మాట్లాడుతూ.. ఇది ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత కాంపాక్ట్ ఫ్లయింగ్ మెషీన్ అని పేర్కొన్నారు. తయారీకి రెండేళ్ల సమయం పట్టిందని చెప్పారు. ధరించగలిగే జెట్‌ప్యాక్‌లో డీజిల్ ట్యాంక్, ఎలక్ట్రానిక్స్‌తో కూడిన బ్యాక్‌ప్యాక్ ఉంటుందని, ట్యాంక్ సామర్థ్యం 30 లీటర్లని చెప్పారు.ఇంకా సాయుధ దళాలకు ఇవ్వలేదని, ఆర్మీ నుంచి వచ్చిన RFPకి ప్రతిస్పందించామని పేర్కొన్నారు.వచ్చే వారం ప్రదర్శనలు జరగాల్సి ఉందని, అంతా సవ్యంగా జరిగితే సరఫరా చేయడానికి మాకు అవకాశం లభిస్తుందని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India, Indian Army, National News