ACTOR KANGANA RANAUT AND HER SISTER RANGOLI REACHES BANDRA POLICE STATION IN SEDITION CASE HSN
Kangana Ranaut: పోలీస్ స్టేషన్ కు కంగనా రనౌత్.. వీడియో ప్రూఫ్స్ తో సహా సిద్ధమైన అధికారులు
బాంద్రా పోలీస్ స్టేషన్ కు హాజరయిన కంగనా రనౌత్
ఓ దర్శకుడి ఫిర్యాదు మేరకు 2019లో కంగనా రనౌత్ తోపాటు ఆమె సోదరిపై బాంద్రా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. మొదట్లో ఆమె ఈ కేసు విచారణకు సహకరించలేదు. చివరకు ముంబై హైకోర్టు ఉత్తర్వుల మేరకు కంగనా రనౌత్ పోలీసుల ఎదుట హాజరు కాక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటి కంగనా రనౌత్ శుక్రవారం బాంద్రా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. 2019వ సంవత్సరంలో నమోదైన ఓ కేసుకు సంబంధించి పోలీసులు ఆమెను విచారణ చేయనున్నారు. ఆమెను ఏఏ ప్రశ్నలు అడగాలి.? అన్న దానిపై పోలీసులు ఇప్పటికే ఓ జాబితాను సిద్ధం చేశారు. ఓ దర్శకుడి ఫిర్యాదు మేరకు 2019లో కంగనా రనౌత్ తోపాటు ఆమె సోదరిపై బాంద్రా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. మొదట్లో ఆమె ఈ కేసు విచారణకు సహకరించలేదు. చివరకు ముంబై హైకోర్టు ఉత్తర్వుల మేరకు కంగనా రనౌత్ పోలీసుల ఎదుట హాజరు కాక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
‘కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలీ చందేల్ చేస్తున్న వివాదాస్పద ప్రకటనలు, ట్వీట్లు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. వారి చర్యల వల్ల బాలీవుడ్ లోని కొన్ని వర్గాలు, మతాల మధ్య విద్వేషాలు చెలరేగుతున్నాయి. వారిద్దరిపై చర్యలు తీసుకోండి. వారి వల్ల సినీ నిర్మాణాలు ఆగిపోతున్నాయి. నాతో సహా వందలాది మంది ఉపాధి కోల్పోతున్నారు.‘ అంటూ బాలీవుడ్ క్యాస్టింగ్ డైరెక్టర్ సాహిల్ సయ్యద్ 2019 అక్టోబర్ నెలలో ఫిర్యాదు చేశారు. దీంతో అదే ఏడాది అక్టోబర్ 17న ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించాలని బాంద్రా మేజిస్ట్రేట్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బాంద్రా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు.
విచారణకు హాజరు కావాల్సిందిగా కంగనాకు, రంగోలీకి పలుమార్లు బాంద్రా పోలీసులు నోటీసులు పంపించారు. అయినప్పటికీ కంగనా విచారణకు హాజరుకాలేదు. ఈ కేసుపై కంగనా ముంబై హైకోర్టుకు వెళ్లింది. అయితే హైకోర్టులో కంగనాకు ఊరట లభించలేదు. కంగనాను, రంగోలీని బాంద్రా పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో కంగనా, ఆమె సోదరి తప్పనిసరి పరిస్థితుల్లో బాంద్రా పోలీస్ స్టేషన్ కు శుక్రవారం విచారణకు హాజరయ్యారు.. అయితే ఎలాంటి బెరుకు లేకుండా, నవ్వుతూ, అభిమానులకు అభివాదాలు చెప్తూ కంగనా, బాంద్రా పోలీస్ స్టేషన్ లోకి వెళ్లడం గమనార్హం. కంగనాను ఏఏ ప్రశ్నలు అడగాలన్న దానిపై పూర్తి సన్నద్ధతతో ఉన్నామని బాంద్రా పోలీసులు వెల్లడించారు. ఆమె ట్వీట్లు, వీడియో ప్రకటనల గురించి ఆమెను విచారిస్తామన్నారు. అవసరమయితే విచారణ ముగిసిన తర్వాత కూడా మళ్లీ పోలీస్ స్టేషన్ కు కంగనా రావాల్సి ఉంటుందన్నారు. కాగా కంగనాతోపాటు అడ్వకేట్ రిజ్వాన్ సిద్ధిఖీ కూడా ఆమె పక్కన ఉండటం గమనార్హం.