India - China Tension : భారత్ - చైనా సరిహద్దుల్లో ఈమధ్య జరిగిన ఘర్షణను దృష్టిలో పెట్టుకొని.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) యుద్ధ విమానాలు అరుణాచల్ ప్రదేశ్‌పై కంబాట్ ఎయిర్ పాట్రోల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఒక రకంగా ఇది చైనాకి హెచ్చరిక అనుకోవచ్చు. ఈ యుద్ధ విమానాలు గాల్లో రయ్యిన దూసుకెళ్తాయి. ఆ శబ్దం భరించలేనంతగా ఉంటుంది. వీటిని చూసైనా చైనా సైన్యం వెనక్కి తగ్గాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్లు సమాచారం. సరిహద్దు అవతల చైనా కూడా ఇదే విధంగా యుద్ధ విమానాలను నడుపుతోంది. ఈమధ్య కొన్ని వారాలుగా అవి గాల్లో అప్పుడప్పుడూ చక్కర్లు కొడుతున్నాయి. అందుకే IAF కూడా గట్టిగా బదులిస్తున్నట్లు తెలిసింది.
భారత్ - చైనా సరిహద్దు అయిన అరుణాచల్ ప్రదేశ్ .. తవాంగ్ లోని LAC సమీపంలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ తలెత్తిన అంశంపై ఇవాళ లోక్‌సభ దద్దరిల్లుతోంది. దీనిపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుపడుతుంటే.. దీనిపై మధ్యాహ్నం రాజ్యసభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరణ ఇస్తారని ప్రభుత్వం తెలిపింది. అయినా విపక్షాలు వెనక్కి తగ్గట్లేదు. ఘర్షణల్లో రెండువైపులా సైనికులకు గాయాలయ్యాయని రాజ్‌నాథ్ తెలిపారు. భారత భూభాగంలోకి చైనా సైనికులు వచ్చేందుకు యత్నించారనీ.. మన సైనికులు వారి ప్రయత్నాన్ని తిప్పికొట్టారని లోక్‌సభలో తెలిపారు. మన సైనికుల్లో ఎవరికీ గాయాలు కాలేదని ఆయన తెలిపారు.
డిసెంబర్ 9, 2022న సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 30 మంది భారత జవాన్లు గాయపడినట్లు పలు వార్తా పత్రికల్లో కథనాలు వచ్చాయి.
ఈ ఘర్షణ అంశంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ అనిల్ చౌహన్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, నేవి చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.