(డి.పి.సతీష్, న్యూస్ 18, బెంగళూరు)
కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థలూ కుదేలయ్యాయి. భారత్ కూడా ఒడిదుడుగులను ఎదుర్కొంటోంది. ఐతే ఈ కరోనా సమయంలో గ్రామీణ భారతం పుంజుకుంటోంది. లాక్డౌన్ వల్ల అందరూ గ్రామాలకు వెళ్లిపోవడం, సమృద్ధిగా వర్షాలు పడడంతో.. గత ఏడాదితో పోల్చితే వ్యవసాయ సాగు ఏకంగా 150 శాతం పెరిగింది. భారత్కు నైరుతి పవనాలే జీవనాధారం. ఈ సీజన్లో తొలి 45 రోజులు మంచి వర్షాలను తెచ్చాయి రుతుపవనాలు. ఈ ఏట పంటలు సమృద్ధిగా పండడంతో పాటు ఎండాకాలంలో నీటి ఎద్దడి ఉండబోదనే ధైర్యాన్ని ఇస్తున్నాయి. రైతులకు ఆర్థిక భరోసా కూడా కల్పిస్తున్నాయి.
IMD డేటా ప్రకారం.. నాలుగు రాష్ట్రాలు మినహా దేశమంతటా ఈ ఏడాది 18శాతం అధిక వర్షపాతం కురిసింది. కేరళ, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరంలో మాత్రం కాస్త తక్కువ నమోదయింది. దేశమంతటా పంటలు వేయడం ఇప్పటికే 88 శాతం పూర్తయింది. లాక్డౌన్ వల్ల చాలా మంది కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోయి వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతు కూలీల ఖర్చులు దిగొచ్చాయి. అటు వర్షాలు కూడా బాగా పడుతుండడంతో దేశమంతటా ఈ సీజన్లో పంటల సాగు పెరిగింది. గత ఏడాదితో పోల్చితే 20 లక్షల హెక్టార్లు అధికంగా వరిని సాగు చేస్తున్నారు. దాంతో బియ్యం ఎగుమతిలో ఈసారి భారత్ రికార్డు సృష్టించే అవకాశముంది.
వ్యవసాయశాఖ నిపుణుల ప్రకారం.. సకాలంలో వర్షాలు కురిస్తే పంటకు మద్దతు ధర పెరుగుతుంది. ప్రస్తుతం సమృద్ధిగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో.. పంటు పుష్కలంగా పండి.. మద్దతు ధర కూడా పెరుగుతుందన్న అంచనాలున్నాయి. అటు దేశవ్యాప్తంగా ఎరువులకు గిరాకీ పెరిగింది. గత ఏడాది 82.81 లక్షల టన్నులు అమ్ముడయితే.. ఈసారి ఏకంగా 111.61 టన్నుల ఎరువుల కొనుగోళ్లు జరిగాయి.
వరితో పాటు పప్పులు, తృణ ధాన్యాలు, నూనె గింజలు, చెరకు, పత్తి, సోయాబీన్స్ సాగు కూడా పెరిగింది.
పంట | 2019 ( లక్షల హెక్టార్లలో) | 2020 (లక్షల హెక్లార్టలో) |
పప్పులు | 9.46 | 36.82 |
తృణ ధాన్యాలు | 35.20 | 70.69 |
నూనె గింజలు | 33.63 | 109.20 |
పత్తి | 45.85 | 91.67 |
చెరుకు | 49.86 | 50.62 |
సోయాబీన్స్ | 16.43 | 81.81 |
ఈ ఏడాది రికార్డు స్థాయిలో పంటలు సాగవుతున్నాయి. గత ఏడాది 202 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేయగా.. ఈసారి 432 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి. అంటే గత ఏడాదితో పోల్చితే రెట్టింపు కన్నా ఎక్కువ.
జమ్మూకాశ్మీర్, గుజరాత్, తెలంగాణ, బీహార్, అసోం, మేఘాలయ, తమిళనాడులో 1 నుంచి 60శాతం అధిక వర్షపాతం నమోదయింది. పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, యూపీ, ఝార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్నాటకలో సాధారణ వర్షపాతం నమోదయింది. ఈ ఏడాది 60శాతం అధిక వర్షపాతంతో ఏపీ రికార్డు సృష్టించింది.
రైతులు ఒక రెండు నెలలు పాటు పంటలను కాపాడుకోగలిగితే.. ఈ సారి పంటల ఉత్పత్తిలో భారత్ రికార్డులు సృష్టింవచ్చు. ప్రపంచానికే అన్నపూర్ణగా అవతరించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Farmer, Heavy Rains, Monsoon rains