అభినందన్ వర్థమాన్ హీరో అంటూ దేశం మొత్తం గర్విస్తున్న వేళ.. గూగుల్లో మరో అంశం కూడా టాప్ ట్రెండింగ్లో నిలిచింది. అదే, వర్థమాన్ కులం. ఆయన ఏ కులానికి చెందిన వాడు? వర్థమాన్ కులం ఏంటి? వర్థమాన్ జైన్? అభినందన్ జైన్ కులం... అంటూ తెగ వెతికారు నెటిజన్లు. వీరిలో అత్యంత ఎక్కువగా అభినందన్ వర్థమాన్ కులం గురించి వెతికిన రాష్ట్రంగా గుజరాత్ టాప్లో నిలిచింది. తెలుగు రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో ఉన్నా.. టాప్ లిస్టులో మాత్రం లేవు. గూగుల్లో కులం గురించి వెతకడం ఇదే మొదటిసారి కూడా కాదు. గతంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఒలింపిక్ సిల్వర్ మెడల్ సాధించినప్పుడు కూడా జనం ఆమె కులం గురించి గూగుల్లో శోధించారు. అలాగే, ఐఏఏఎఫ్ వరల్డ్ అండర్ 20 ఛాంపియన్షిప్లో హిమాదాస్ గోల్డ్ మెడల్ సాధించినప్పుడు కూడా నెటిజన్లు ఆమె కులం గురించి తెలుసుకోవడానికి సెర్చ్ చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
మిగ్ 21 యుద్ధ విమానం కూలి అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పడిపోయారు. అక్కడి ఆర్మీ అతడిని పట్టుకుంది. ఆ సమయంలో బయటకు వచ్చిన ఓ వీడియో అతడిని హీరోను చేసింది. పాక్ అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు అతడు ఇచ్చిన సమాధానం భారతీయులను ఫిదా చేసింది. తాను దక్షిణ భారతీయుడిని అనిమాత్రమే చెప్పిన అభినందన్.. ఆ తర్వాత పాక్ ఆర్మీ అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదు. శత్రువు చేతిలో బందీగా ఉన్నా కూడా ఏ మాత్రం బెదరకుండా అతడు చూపిన ధైర్యసాహసాలకు జనం జేజేలు పలికారు.