రాబోయే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడం కోసం తమతో కలిసి వచ్చే అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుని ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీలోని అధికార పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీతోనూ కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి అటు కాంగ్రెస్, ఇటు ఆప్ క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే తాజాగా ఈ అంశంపై స్పందించిన ఆప్ నాయకుడు గోపాల్ రాయ్... కాంగ్రెస్తో పొత్తు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం స్పందించిన గోపాల్ రాయ్... తాము విషం తాగడానికి సిద్ధంగా ఉన్నామని పరోక్షంగా కామెంట్ చేశారు. అయితే ప్రస్తుతానికి ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోవద్దని అనుకుంటున్నామని వివరించారు. కాంగ్రెస్తో కలవడం ఇష్టం లేకపోయినప్పటికీ... కొన్ని పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడేందుకు తాము కూడా వారితో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
కోల్కతాలో బెంగాల్ సీఎం నేతృత్వంలో జరగనున్న బీజేపీ వ్యతిరేక పార్టీల ఐక్యతా ర్యాలీలో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పాల్గొనడానికి కొద్ది గంటల ముందే ఆప్ నేత ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి ఢిల్లీతో పాటు పంజాబ్ హర్యానాలోనూ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఆప్ భావించింది. అయితే పంజాబ్లో ఆప్ పూర్తిగా బలహీనపడిందని సీఎం అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించడం... ఆప్ చాలా చిన్న పార్టీ అంటూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వ్యాఖ్యానించడంతో ఆ పార్టీకి కోపం తెప్పించాయి.
Published by:Kishore Akkaladevi
First published:January 18, 2019, 19:43 IST