ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి నిప్పులు చెరిగారు. దేశాన్ని కాపాడుకోవడానికి తామంతా ఒక్కటయ్యామని, నరేంద్ర మోదీ ఇక రోజులు లెక్కపెట్టుకోవాలని హెచ్చరించారు. త్వరలోనే ఆయన కుర్చీ దిగుతారని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన విపక్షాల మహార్యాలీలో చంద్రబాబు పాల్గొన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌కు సంఘీభావం తెలిపారు. చంద్రబాబుతోపాటు మమతా బెనర్జీ కూడా ఈ ర్యాలీకి హాజరయ్యారు. కాంగ్రెస్, ఇతర పక్షాల నేతలు కూడా పాల్గొన్నారు.
‘మోదీ పాలనలో ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను కోల్పోయాం. విపక్ష నేతలందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, ఐటీ దాడులు చేయిస్తున్నారు, అదే సమయంలో బీజేపి నేతలపై మాత్రం ఒక్క దాడి జరగలేదు. ఇలాంటి అప్రజాస్వామ్య పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకే మేమంతా ఏకమయ్యాం.’ అంటూ చంద్రబాబు మరో ట్వీట్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే ముందు దేశ ప్రజలు విశాలదృక్పథంతో ఆలోచించాలని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. దేశం అభివృద్ధి చెందడానికి ఎంతో ఆస్కారం ఉందని, అయితే దేశానికి ఓ మంచి చదువుకున్న వ్యక్తి నాయకత్వం అవసరం ఉందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అణగదొక్కే నాయకులు అవసరం లేదన్నారు.
ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా పెళ్లి శుభలేఖ