భారత ఎన్నికల వ్యవస్థకు సంబంధించి కేంద్రంలోని మోదీ సర్కార్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. దేశంలో ఎన్నికల వ్యవస్థను, ప్రక్రియను, ఎన్నికల సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈసీ పంపిన సిఫార్సులకు ఆమోదం తెలిపింది. ఎన్నికల విధానంలో అవకతవకలకు చెక్ పెట్టేలా ప్రక్షాళన చేపట్టింది. ఈ మేరకు రూపొందించిన బిల్లులకు కేంద్ర కేబినెట్ బుధవారం నాడు ఆమోదం తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యతన ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రులు మీడియాకు వివరించారు. కేంద్రంలో సర్కారు ఏర్పాటులో కీలంగా ఉండే దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ మోదీ సర్కార్ ఈ నిర్ణయాలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన బిల్లులు, సంబంధిత అంశాల వివరాలు ఇవే..
ఓటర్ ఐడీకి ఆధార్ లింక్
సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరికీ సాధారణ గుర్తింపుగా మారిన ఆధార్ కార్డును ఇకపై ఓటరు గుర్తింపు కార్డుకు సైతం అనుసంధానం చేయనున్నారు. దేశంలో నకిలీ ఓట్లు, ఇతరత్రా అవకతవకల్ని నివారించడానికి ఓటరు ఐడీకి ఆధార్ ను లింక్ అవసరమని ఈసీ గతంలో పంపిన ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. ఈ మేరకు రూపొందిన బిల్లులో నాలుగు కీలక అంశాలుండగా, వాటిలో ప్రధానమైనది ఓటర్ ఐడీకి ఆధార్ లింకు. ప్రస్తుతం జరుగుతోన్న శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. తద్వారా అర్హులైన ఓటర్లందరూ తమ ఓటర్ ఐడీకార్డులకు ఆధార్ కార్డును అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఇక
ఇకపై ఏడాదికి 4సార్లు ఓటరు నమోదు
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదించిన ఎన్నికల సంస్కరణ బిల్లులో రెండో ప్రధానాంశం ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించింది. ఇప్పటిదాకా మన దేశంలో కొత్త ఓటర్ల నమోదుకు ఏడాదికి ఒకసారి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. కొత్త బిల్లు ద్వారా ఇకపై ఏడాదికి నాలుగు సార్లు కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకునే వీలుంటుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుండి, 18 సంవత్సరాలు నిండిన మొదటి సారి ఓటర్లు నాలుగు వేర్వేరు కటాఫ్ తేదీలతో సంవత్సరానికి నాలుగు సార్లు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే,
ఉద్యోగిణుల భర్తలకూ పోస్టల్ ఓట్లు..
ఎన్నికల సంస్కరణకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదించిన బిల్లులో మూడో అంశం.. మహిళా సర్వీస్ ఓటర్ల గురించి. దేశంలో సైన్యం సహా సర్వీసు ఓటర్ల కుటుంబాలకు ఓటు హక్కు విషయంలో ఇప్పటివరకూ పలు ఆంక్షలు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ వాడుకునే సదుపాయం పురుష సర్వీస్ ఓటరు భార్యకు మాత్రమే అందుబాటులో ఉంది. మహిళా సర్వీస్ ఓటర్లకు ఇన్నాళ్లు ఆ సదుపాయం లేదు. ఈ లోపాన్ని సరిదిద్దుతూ, సర్వీస్ ఆఫీసర్ల కోసం చట్టాన్ని లింగ భేదాల్లేకుండా చేయాలన్న ఈసీ సిఫార్సుపై కేంద్ర ప్రభుత్వం బిల్లును రూపొందించింది. కొత్త బిల్లు ప్రకారం ఇకపై మహిళా సర్వీస్ ఓటరు భర్తకు కూడా దీన్ని అందుబాటులోకి తెస్తున్నారు. చివరిగా,
ఈసీకి మరిన్ని అధికారాలు...
కేంద్ర సర్కార్ ఇవాళ ఆమోదించిన నాలుగు ఎన్నికల బిల్లుల్లో చివరిది, అతి కీలకమైన అంశం.. ఎన్నికల సంఘానికి మరిన్ని విస్తృత అధికారాలు కల్పించేందుకు ఉద్దేశించింది. ఎన్నికల సమయంలో ఎన్నికల నిర్వహణ కోసం దేశంలో ఏదైనా ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అన్ని అధికారాలను ఈసీకి కల్పించే అంశాలు కొత్త బిల్లులో ఉన్నాయి. ఎన్నికల సమయంలో స్కూళ్లు, ఇతర ప్రదేశాలను ఈసీ స్వాధీనం చేసుకోవడంపై రకరకాల అభ్యంతరాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ఈసీకి అలాంటి అడ్డంకులు రాకుండా అధికారాలను పెంచనున్నారు. ఎన్నికల సంస్కరణలపై ఈసీ గత జులైలో కేంద్ర న్యాయశాఖకు సిఫార్సులు పంపగా, వాటిని పరిశీలించిన కేంద్రం.. ఈ మేరకు బిల్లును రూపొందించింది. కేంద్రం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే దీనిని సభ ముందుకు తేనుంది. అయితే, మరి కొద్ది రోజుల్లో యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనుండగా, కొత్త సంస్కరణల ప్రభావం వాటిపై ఏమేరకు ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar card, Election Commission of India, Elections, Pm modi, Union cabinet