అడుక్కోడానికి సెలవు కోరిన ప్రభుత్వ ఉద్యోగి -గత జన్మ గుర్తుకురావడంతో -Asaduddin నకులుడు, Mohan Bhagwat శకుని అంటూ..

అడుక్కోడానికి సెలవు అడిగిన ప్రభుత్వ ఉద్యోగి

MP Engineer Viral Letter: స్కూల్ ఎగ్గొట్టడానికి సెలవు చీటిలో ఇంట్లో వాళ్లను చంపేసిన చిలిపి అనుభవం చాలా మందికి ఉండొచ్చు. ఇప్పుడు ఆన్ లైన్ బోధన పెరిగాక పిల్లలు టెక్నాలజీ ట్రిక్స్ నేర్చారనుకోండి ! అయితే, సెలవుల చరిత్రలోనే ఓ సరికొత్త, అసాధారణ తీరుకు తెరలేపాడో ప్రభుత్వ ఉద్యోగి. ఆదివారంపూట సెలవు కోసం అతను చెప్పిన కారణాలు షాకింగ్ గానూ, అనూహ్యంగానూ గోచరిస్తాయి. తాత్విక చింతన, రాజకీయ వ్యాఖ్యానం, గతజన్మ స్మృతులతో కూడిన ఆ లీవ్ లెటర్ నెట్టింట వైరలైంది..

  • Share this:
ఆదివారం పూట భిక్షం అడుక్కోడానికి వీలుగా సెలవు మంజూరు చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ రాసిన ఓ ప్రభుత్వ ఉద్యోగి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పైపెచ్చు ప్రస్తుత భారత రాజకీయాల్లో కీలకవ్యక్తులైన మోహన్ భగవత్, అసదుద్దీన్ ఓవైసీల పేర్లను సైతం లీవ్ లెటర్ లో ప్రస్తావించాడతను. అదేంటి? ఆదివారం సెలవురోజే కదా? ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి బిక్షమెత్తడమేంటి? హిందూ-ముస్లిం విభేదాలపై ఏదైనా నిరసనా? తరహా సందేహాలు తలెత్తకముందే అసలు కథనంలోకి పోదాం..

అది.. మధ్యప్రదేశ్ లోని ఆగ్రా మాల్యా జిల్లా, సన్సేర్ తాలూకా.. రాష్ట్ర పంచాయితీ శాఖలో సబ్ ఇంజనీర్ గా పనిచేస్తోన్న రాజ్ కుమార్ యాదవ్ ఆదివారం నాడు ప్రెస్ మీట్ కు పిలుపిచ్చాడు. అప్పటికే అతను రాసిన సెలవు విజ్ఞప్తి లేఖ ఒకటి జిల్లాలో వైరలైంది. సదరు వైరల్ లేఖలోని విషయాలు వాస్తవమేనని చెప్పుకోడానికే ఆ ఇంజనీర్ ప్రెస్ మీట్ పెట్టాడు. పని ఒత్తిడి కారణంగా ఆదివారాలు కూడా డ్యూటీ చేయాల్సి వస్తోందని, ఈ మధ్యే తనకొచ్చిన కల ద్వారా కొన్ని అద్భుతమైన విషయాలు తెలిశాయని, ఇకపై ప్రతి ఆదివారం పూర్తిగా ఆథ్యాత్మిక చింతనకే పరిమితం కావాలనుకుంటున్నానని, ఇగో తగ్గించుకోడానికి భిక్షాటన కూడా చేస్తానని, కచ్చితంగా ఈ కారణాలపైనే సెలవు మంజూరు చేయాల్సిందిగా లేఖ రాసిన మాట వాస్తవమేనని ఇంజనీర్ రాజ్ కుమార్ తెలిపాడు.

‘కొన్ని రోజుల కిందట నాకొక కలొచ్చింది. అందులో నా గత జన్మ స్మృతులు తెలిశాయి. పోయిన జన్మలో మహాభారత కాలంలో పుట్టాన్నేను. ప్రస్తుత మజ్లిస్ నేత అసద్దీన్ ఓవైసీ గత జన్మలో పాడవుల్లో ఒకరైన నకులుడు. అతను నేను మంచి మిత్రులం కూడా. ప్రస్తుత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారేమో ఆ జన్మలో శకుని మామ. గత జన్మ గురించి తెలుసుకున్న తర్వాత నాలో ఆథ్యాత్మిక చింతన పెరిగింది. సమయం చిక్కినప్పుడల్లా భగవద్గీతా పఠనం చేస్తున్నాను. ఆ బోధనల అనుసారం అహాన్ని(ఈగోను) పూర్తిగా వదిలేయాలనుకుంటున్నాను. భిక్షం అడుక్కొని నా అహాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నాను. అయితే, పని ఒత్తిడి వల్ల అది కుదరడంలేదు. దయచేసి ఆదివారం నాడు నాకు సెలవిప్పించండి..’ అని లేఖలో రాసిన విషయాన్ని మీడియాకూ చెప్పుకొచ్చాడు ఇంజనీర్ రాజ్ కుమార్.

ఆదివారం అడుక్కోడానికి సెలవు కావాలంటూ సబ్ ఇంజనీర్ రాసిన లేఖ ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వైరల్ లేఖపై ఆగ్రా మాల్యా జిల్లా పంచాయితీ అధికారులు స్పందించారు. రాజ్ కుమార్ వినతిని తిరస్కరిస్తున్నట్లుగా.. సిబ్బంది కొరత కారణంగా అత్యవసర విభాగాల్లోని ఉద్యోగులు అందరూ ఆదివారాలు కూడా పని చేయాల్సిందేనని మౌఖికంగా బదులిచ్చారు. వింత సెలవు చీటితో పాపులరైన రాజ్ కుమార్ ను కొందరు సమర్థిస్తే ఇంకొందరు విమర్శిస్తున్నారు. మరి మీరేమంటారు?
Published by:Madhu Kota
First published: