తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత, ఆమె రాజకీయ గురువు MG రామచంద్రన్ (MGR)కి అంకితమిస్తూ మధురైలో నిర్మించిన ఆలయాన్ని ముఖమంత్రి పళనిస్వామి ఇవాళ ప్రారంభిస్తారు. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా... ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుండటం హాట్ టాపిక్ అయ్యింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 2016లో కన్నుమూసిన తర్వాత ఇలాంటి కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి. జయలలిత నీడ లాంటి శశికళ శిక్షా కాలం పూర్తి చేసుకొని... 4 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన సందర్భంలో ఇది జరుగుతుండటం రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ టెంపుల్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఉదయ్ కుమార్ నిర్మించారు. ఆయన్ని జయలలితే... మొదటిసారి క్యాబినెట్లోకి తీసుకున్నారు. ఆమెపై భక్తిని చాటుకుంటూ... ఎకరంన్నర స్తలంలో మధురైలోని టి కల్లుపత్తి ఏరియాలో రూ.50 లక్షలు ఖర్చు పెట్టి దీన్ని నిర్మించారు. ఇందులో జయలలిత, MGR కాంస్య (bronze) విగ్రహాలు ఉంటాయి.
"అమ్మను మేం ఎన్నో పేర్లతో పిలుస్తాం. అంటే ఇదయ తీవం (దయగల దేవత), కావల్ తీవం (దేవుళ్ల రక్షకురాలు), కులసామీ (గిరిజనుల దేవత)... ఈ ఆలయం అదే చూపిస్తోంది. ప్రజలు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లూ చేశాం. చాలా స్థలం ఉండేలా నిర్మించాం" అని మంత్రి తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో జయలలిత పేరును అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టేందుకు ఇదో రాయకీయ తంత్రమా అని రిపోర్టర్లు ప్రశ్నించారు. "MGR, జయలలిత ఎన్నో త్యాగాలు చేశారు. అందుకే మాలాంటి ఎంతో మంది వాళ్లను దేవుడు, దేవతగా చూస్తాం" అని మంత్రి సమాధానం ఇచ్చారు.
జయలలిత బతికున్నప్పుడు ఎంతో మంది అన్నాడీఎంకే నేతలు స్వామి భక్తిని చాటుకునేందుకు పోటీ పడేవారు. కొంతమంది ఆమె ముందు చేతులు కట్టుకొని నిల్చోవడం చేస్తే... ఇంకొంతమంది ఆమె కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకునేవారు, మరికొందరు చెప్పులు కూడా మోసేవారు.
నాలుగుసార్లు సీఎంగా చేసిన జయలలితను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కింది కోర్టు దోషిగా నిర్ధారించింది. తర్వాత హైకోర్టు ఆమెను నిర్దోషిగా విడుదల చేసింది. ఐతే... ఈ కేసుపై 2017లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగా... అంతకు ముందే ఆమె చనిపోయారు. జయలలిత ఫ్రెండ్ శశికళతోపాటూ... మరో ఇద్దరిని సుప్రీంకోర్టు జైలుకు పంపింది. నాలుగేళ్ల తర్వాత గత వారం రిలీజైన శశికళ... అధికార అన్నాడీఎంకే పార్టీకి షాక్ ఇస్తూ... ఓటు బ్యాంకును చీల్చుతారనే అంచనా ఉంది. ఆమెకు చెందిన తీవర్ వర్గ ప్రజల ఓట్లు అన్నాడీఎంకేకి రాబోవని తెలుస్తోంది.
2019 లోక్ సభ ఎన్నికల్లో బలహీనపడిన అన్నాడీఎంకే... తిరిగి గత వైభవం తెచ్చుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ వారం ప్రారంభంలో... జయలలితకు సంబంధించి 79 కోట్లతో నిర్మించిన ఫీనిక్స్ తరహా స్మృతి చిహ్నాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అంతేకాదు... జయలలిత ఇల్లు పోయస్ గార్డెన్‌ను ఓ మెమోరియల్లా మార్చేశారు. మరి ప్రజలు ఎవరివైపు అన్నది ఎన్నికల్లో తేలుతుంది.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.