A SECTION OF VOTERS WOULD BE ALLOWED TO CAST THEIR VOTE THROUGH THE POSTAL BALLOT AT THE HOMES IN MANIPUR ASSEMBLY SSR
First Time in India: కీలక ప్రకటన చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. దేశ ఎన్నికల చరిత్రలోనే ఇలా తొలిసారి..
ప్రతీకాత్మక చిత్రం
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా పోలింగ్ కేంద్రానికి రాకుండా ఇంటి వద్ద నుంచే ఓటు వేసే వెసులుబాటు కల్పించింది. అయితే.. ఆ అవకాశం అందరికీ కాదు కొందరికి మాత్రమే.
ఇంఫాల్:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా పోలింగ్ కేంద్రానికి రాకుండా ఇంటి వద్ద నుంచే ఓటు వేసే వెసులుబాటు కల్పించింది. అయితే.. ఆ అవకాశం అందరికీ కాదు కొందరికి మాత్రమే. వృద్ధులు, కోవిడ్-19 బారిన పడిన వారికి, కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికి.. వారి ఓటును ఇంటి వద్ద నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సుశీల్ చంద్ర మంగళవారం నాడు మీడియాకు వెల్లడించారు.
అయితే.. ఈ వెసులుబాటు మణిపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకునేవారికి ఉంటుందని తెలిపారు. మణిపూర్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు విడతలుగా మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం అర్హులైన వారికి ఇంటి వద్ద నుంచే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు కల్పించడం గమనార్హం.
ఇంటి వద్ద నుంచి ఓటు వినియోగించుకుంటున్నారు కనుక అవకతవకలు జరిగే అవకాశం ఉందనే ఆలోచనలకు ఆస్కారమే లేదని సుశీల్ చంద్ర చెప్పారు. ఇంటి వద్ద ఓటు వినియోగించుకునే ప్రక్రియ అంతటినీ వీడియో రూపంలో రికార్డు చేస్తామని.. ఓటు ఎవరికి వేశారనే విషయం తప్ప అంతా వీడియోలో రికార్డు అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ గోప్యంగా, పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. ఏజెంట్లు, మైక్రో అబ్జర్వర్లు, బూత్ లెవెల్ అధికారుల సమక్షంలో ఇంటి వద్ద ఓటరు తన ఓటును పోస్టల్ బ్యాలెట్ విధానంలో వినియోగించుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మణిపూర్‌కు మహిళల కోసం ప్రత్యేకంగా 487 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసినట్లు సీఈసీ తెలిపింది.
మణిపూర్‌లో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 86.36 శాతం ఓటింగ్, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 82.78 శాతం ఓటింగ్ నమోదైంది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల సంఖ్యను ఎన్నికల సంఘం పెంచింది. గత ఎన్నికల కంటే 174 పోలింగ్ కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేసింది. 2968 పోలింగ్ కేంద్రాలకు గానూ 2400 కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. 115 మోడల్ పోలింగ్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చారు. ఇదిలా ఉండగా.. మణిపూర్ ఎన్నికల్లో ధన ప్రవాహం ఏరులై పారుతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకూ మణిపూర్‌లో రూ.97.6 కోట్లను సీజ్ చేశారు. ఇందులో.. కోటి 48 లక్షల డబ్బు, 40 లక్షల విలువ చేసే మద్యం, రూ.81.5 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, 14.2 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.