ఆక్సిజన్ అందక భార్య చనిపోయిందని.. ఈ సమాజం కోసం మొక్కలు నాటుతున్న భర్త

ప్రతీకాత్మక చిత్రం

కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎంతో మంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారు. ఊపిరిడాక విలవిల్లాడి మరణించారు. ఐతే ఆక్సిజన్ అందక తన భార్య చనిపోయినందుకు ఆమె భర్త మొక్కలు నాటుతున్నారు.

 • Share this:
  కరోనా సెకండ్​వేవ్​ అనూహ్యంగా విరుచుకుపడడంతో నెలక్రితం వరకు భారత్​లోని వైద్య సదుపాయాలు సరిపోని స్థితి వచ్చింది. ఆసుపత్రుల్లో చాలా మందికి కనీసం బెడ్లు కూడా దొరకలేదు. ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడింది. దీంతో ప్రాణవాయువు అందక కొందరు మృతి చెందిన విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇలాగే గుజరాత్​లోని అహ్మదాబాద్​కు చెందిన నేహా కూడా ఆక్సిజన్ అందక మృతి చెందారు. ఎంతో వేదన చెందిన ఆమె భర్త ధృవల్​ పటేల్ అద్భుత కార్యక్రమం చేపట్టారు. ఆమె జ్ఞాపకంగా మొక్కలు నాటుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడం.. ఆ సమయంలో కావాల్సినంత ఆక్సిజన్ దొరకకపోవడంతో మే 12న నేహా చనిపోయారు. కరోనాతో పోరాడుతున్న సమయంలో ఆక్సిజన్​ స్థాయిలు పడిపోయి తీవ్ర వేదన అనుభవించారు. దీంతో నేహా జ్ఞాపకంగా పర్యావరణ పరిరక్షణకు ఆమె భర్త ధృవల్​, 15 ఏళ్ల కుమారుడు పూర్వ మొక్కలు నాటుతున్నారు. ఇప్పటి వరకు ఇద్దరూ కలిసి 450కు పైగా మొక్కలు నాటారు.

  నేహా అంత్యక్రియలు నిర్వర్తించిన సిధ్​పూర్​లోనే ధృవల్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కనీసం మూడు మొక్కలు నాటాలని అంత్యక్రియలు చేసిన పురోహితుడు తనకు చెప్పారని ధృవల్ వెల్లడించారు. ఆ చెట్లు పెరిగాయక వచ్చిన కలప వేరే వారి అంత్యక్రియలు ఉపయోగపడుతుందని సూచించారని ఆయన చెప్పారు. దీంతో అక్కడ ధృవల్ మూడు మొక్కలు నాటారు. అయితే ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించుకొని ముందుకు సాగుతున్నారు.

  సెకండ్​వేవ్ సమయంలో ధృవల్ కుటుంబంలో నలుగురు కరోనా బారిన పడ్డారు. ధృవల్​​తో పాటు నేహా, ఆయన కుమారుడు, తండ్రి వైరస్​కు గురయ్యారు. వీరిలో నేహా ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించింది. కరోనా బారిన పడిన మూడో రోజే ఆమెను ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది.

  భార్య మృతి చెందిన విషాదం నుంచి తాను ఇంకా బయటికి రాలేకపోతున్నానని ధృవల్ చెప్పారు. తమ పెళ్లయి 17 సంవత్సరాలు అయిందని, ఎప్పుడూ వేరుగా ఉండలేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. నేహా లేకుండా భవిష్యత్తును ఎప్పుడూ ఊహించుకోలేదని, ఇకపై జీవితం కష్టమేనని వేదన చెందారు.

  మరోవైపు భారత్​లో కరోనా వైరస్ రెండో వేవ్​ ప్రభావం ఇప్పుడే క్రమంగా తగ్గుతున్నది. దేశంలో రోజువారీ కేసుల్లో తరుగుదల కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో మూడోవేవ్ ప్రమాదం కూడా ఉందని అంచనాలు వెలువడుతుండడంతో ఈసారి సమస్యలు రాకుండా ఆక్సిజన్ సహా వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. వ్యాక్సినేషన్ కూడా వేగవంతం చేసి కరోనాను సమర్థంగా అడ్డుకోవాలని కృషి చేస్తున్నాయి.
  Published by:Shiva Kumar Addula
  First published: