Video: వీధి కుక్కలకు చికెన్ బిర్యానీ పెడుతున్న జంతు ప్రేమికుడు.. సరిలేరు మీకెవ్వరు

కుక్కలకు బిర్యానీ పెడుతున్న రంజిత్

ప్రతి రోజు 30-40 కేజీల వరకు చికెన్ బిర్యానీని వండుతానని రంజిత్ తెలిపారు. చికెన్‌లో మాంసం కంటే ఎముకలే ఎక్కువగా ఉండేలా చూస్తానని.. అవి తక్కువ ధరకే వస్తాయని పేర్కొన్నారు. అప్పుడే మరిన్ని ఎక్కువ కుక్కల ఆకలి తీర్చగలుగుతానని చెప్పుకొచ్చారు.

  • Share this:
    కరోనా లాక్‌డౌన్‌లో ఎంతో మంది జీవితాలు తలకిందులయ్యాయి. ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ చాలా మంది పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. మరి మనుషుల పరిస్థితే ఇలా ఉంటే.. మూగ జీవాల జీవితం ఇంకెంత దుర్భరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. కరోనా మొదలయినప్పటి నుంచి వీధి కుక్కలతో పాటు ఎన్నో జంతువులు ఆకలితో అలమటిస్తున్నాయి. పట్టడెన్నం పెట్టేవారి కోసం ధీనంగా ఎదురుచూస్తున్నాయి. ఎంతో మంది జంతు ప్రేమికులు వీటికి అన్నం పెడుతూ వాటి పట్ల తమ ప్రేమను చాటుకుంటున్నారు. ఐతే నాగ్‌పూర్‌కు చెందిన ఓ పెద్దాయన మాత్రం.. ఏకంగా బిర్యానీనే పెడుతున్నారు. అది కూడా చికెన్ బిర్యానీ. ఏదో ఒక్క రోజు భోజనం పెట్టేసి చేతులు దులుపుకోవడం కాదు. ప్రతి రోజూ వీధి కుక్కల ఆకలి తీర్చుతున్నారు.

    మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన రంజిత్ నాథ్ జంతు ప్రేమికుడు. కుక్కలు, పిల్లులు అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఐతే గత ఏడాది కరోనా లాక్‌డౌన్ మొదలయిన తర్వాత జంతువులకు అన్నం దొరికేది కాదు. వాటిని చూసి ఎంతో చలించిపోయారు రంజిత్. అప్పుడే ఓ నిర్ణయం తీసుకున్నారు. నాగ్‌పూర్‌లో వీధి కుక్కలు, పిల్లులకు ప్రతి రోజు అన్నం పెట్టేందుకు ముందుకొచ్చారు. అలా అప్పటి నుంచీ ప్రతి రోజు దాదాపు 200 వరకు వీధి కుక్కలకు చికెన్ బిర్యానీ పెడుతున్నారు.

    ప్రతి రోజు ఉదయాన్నే లేచి బిర్యానీ చేసేందుకు అన్నింటినీ సిద్ధం చేసుకుంటారు. మధ్యాహ్నం నుంచి బిర్యానీ వండడం మొదలు పెడతారు. సాయంత్రం కాగానే.. బిర్యానీని ఓ పెద్ద గిన్నెలో తీసుకొని, బైక్‌పై నాగ్‌పూర్‌లో తిరుగుతారు. ఎక్కడ వీధి కుక్క కనిపించినా దానికి బిర్యానీ పెడతారు. నాగపూర్‌లో దాదాపు 12 ప్రాంతాలకు ప్రతి రోజు వెళ్తారు. రంజిత్‌ను చూడగానే.. బిర్యానీ వచ్చిందని కుక్కలకు అర్ధమైపోతుంది. వెంటనే ఆయన వద్దకు పరుగెత్తుకొస్తాయి. కేవలం వీధి కుక్కలే కాదు.. పిల్లులకు కూడా భోజనం పెడుతానని చెప్పారు రంజిత్.

    ప్రతి రోజు 30-40 కేజీల వరకు చికెన్ బిర్యానీని వండుతానని ఆయన తెలిపారు. చికెన్‌లో మాంసం కంటే ఎముకలే ఎక్కువగా ఉండేలా చూస్తానని.. అవి తక్కువ ధరకే వస్తాయని పేర్కొన్నారు. అప్పుడే మరిన్ని ఎక్కువ కుక్కల ఆకలి తీర్చగలుగుతానని చెప్పుకొచ్చారు. మొన్నటి వరకు తన సొంత డబ్బులతోనే వీటికి అన్నం పెడుతున్నానన్న ఆయన.. ఇప్పుడు కొందరు దాతలు డబ్బులు ఇస్తున్నారని చెప్పారు. ఈ కుక్కలన్నీతన పిల్లలని జంతువుల పట్ల ప్రేమను వ్యక్తం చేశారు రంజిత్. తాను మరణించే వరకు ఈ అన్నదానం కొనసాగుతుందని.. ఏ ఒక్క జంతువు ఆకలితో మరణించకూడదన్నదే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు.

    జంతువుల పట్ల రంజిత్‌కు ఉన్న ప్రేమను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మనుషులకే అన్న పెట్టలేని వ్యక్తులు ఉన్న ఈ సమాజంలో.. జంతువులకు బిర్యానీ పెడుతున్నారంటే .. మీరు గ్రేట్ సార్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. సరిలేరు మీకెవ్వరు అని కొనియాడుతున్నారు. మీరిచ్చిన స్ఫూర్తితో మేం కూడా మూగ జీవాలకు అన్నం పెడతామని పలువురు ముందుకొస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: