ఓ నాలుగేళ్ల పాప క్యాన్సర్‌తో పోరాడుతోంది. ప్రతినెలా ఆమెకు కీమో థెరపీ చేయిస్తున్నారు. అందులో భాగంగా మార్చి 29న సాయంత్రం 6 గంటలకల్లా ఆ పాప మందులు వేసుకోవాల్సి ఉంది. కానీ స్థానికంగా అవి దొరక్కపోవడంతో ఓ మాజీ పోలీసు అధికారి ఏకంగా 150 కిలోమీటర్లు ప్రయాణించి ఆ పాపకు మందులు అందజేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన కేరళలోని అలెప్పీలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అలెప్పీలో స్థానికంగా నివాసం ఉంటున్న ఓ నాలుగేళ్ల బాలిక క్యాన్సర్‌తో బాధపడుతోంది. క్యాన్సర్‌ను నయం చేసేందుకు కీమో థెరపీ చేయిస్తున్నారు.
అందులో భాగంగా ప్రతినెలా సదరు బాలికను అలెప్పీ నుంచి తిరువనంతపురంలోని ప్రాంతీయ క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించేవారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో తిరువనంతపురానికి వచ్చి వెళ్లడం ఇబ్బందిగా మారింది. దీంతో వైద్యులు ఆ బాలికకు తాత్కాలికంగా మందులు వాడాలని చెప్పారు. ఈ క్రమంలో ఆ బాలికకు మార్చి 29న సాయంత్రం 6 గంటలకల్లా వైద్యులు చెప్పిన మందులు వేయాల్సి ఉంది. కానీ అలెప్పీలో మందులు దొరక్కలేదు. దీంతో కుటుంబ సభ్యులు సివిల్ పోలీసు రతీశ్ను సంప్రదించారు.
తిరువనంతపురం మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న తన స్నేహితుడు, మాజీ పోలీసు అధికారి అయిన విష్ణు దృష్టికి రతీశ్ ఈ విషయాన్ని తీసుకెళ్లాడు. బాలికకు కావాల్సిన మందులు తిరువనంతపురం నుంచి పంపించేందుకు సహకరిస్తానని చెప్పి ఆ మందుల ప్రిస్కిప్షన్ ను పట్టుకెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక ఆ ప్రిస్కిప్షన్ పాతదని వైద్యులు చెప్పారు. పాప పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వైద్యులు అవసరమైన మందులు ఇచ్చారు.
కానీ అప్పటికే బాలికకు మందులు వేయాల్సిన సమయం దగ్గర పడుతుండడంతో విష్ణు వెంటనే ద్విచక్రవాహనంపై ఏకంగా 150 కిలోమీటర్లు ప్రయాణించి సాయంత్రం 5.10 గంటలకల్లా మందులను అందజేశాడు. ఆపద సమయంలో తన మిత్రడుు చాలా రిస్క్ చేసి ద్విచక్రవవాహనంపై అంతదూరం ప్రయాణించాడని రతీశ్ తెలిపారు. మందులు ఇచ్చిన అనంతరం విష్ణు ఒక్క రూపాయి తీసుకోలేదని చెప్పుకొచ్చాడు. ఇదిలావుంటే.. ఆ బాలికది నిరుపేద కుటుంబమని, వైద్యం చేయించ స్థోమత లేక బాలికను కళ్ల ముందే చంపుకోలేక బాధపడుతున్నారని, దాతలు ఎవరైనా సాయం అందించాలని రతీశ్ కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.