కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమ బాట పట్టిన సంగతి తెలిసిందే. రైతు సంఘాల ప్రతినిధుల, కేంద్రం మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో వారు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పంజాబ్‌కు చెందిన ఓ రైతు ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీకి ఓ భావోద్వేగ లేఖ రాశారు. రైతుల ఆందోళనకు కారణమైన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేలా ప్రధాని మోదీని ఒప్పించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. తల్లిగా తన శక్తులన్నీ ఉపయోగించి ఆమె మోదీ మనసు మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, పంజాబ్ ఫిరోజ్‌పూర్ జిల్లాలోని గోల్ కా మోద్ గ్రామానికి హర్‌ప్రీత్ సింగ్ అనే రైతు హిందీలో ఈ లేఖను రాశారు. హిందీలో రాసిన ఈ లేఖలో రైతుల ఆందోళన గురించి పలు అంశాలను ఆయన ప్రస్తావించారు.
"నేను చాలా బరువైన హృదయంతో ఈ లేఖను రాస్తున్నాను. దేశానికి, ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తున్న అన్నదాతలు ఢిల్లీలోని రోడ్లపై పడుకుని ఆందోళన కొనసాగిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎముకలు కొరికే చలిలో ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఇందులో 90-95 ఏళ్ల వయసు ఉన్న వృద్దులు, పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. ఈ శీతల వాతావరణం అనారోగ్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే కొందరు మరణించారు కూడా.. ఇది మనందరికీ ఆందోళన కలిగించే విషయం. నేను చాలా ఆశతో ఈ లేఖను రాస్తున్నాను. ఈ దేశానికి ప్రధానిగా మీ కుమారుడు నరేంద్ర మోదీ.. ఆయన ఆమోదించిన చట్టాలను ఆయనే రద్దు చేయగలరు. ఎవరి మాటనైనా తిరస్కరించవచ్చు కానీ.. తల్లి మాటను ఎవరూ కూడా తిరస్కరించరని నేను నమ్ముతున్నాను. ఒక తల్లి మాత్రమే కొడుకును ఆదశిస్తుంది. ఈ పని చేస్తే దేశం మొత్తం మీకు కృతజ్ఞతలు తెలుపుతుంది" అని పేర్కొన్నారు.
ఇక, ఈ లేఖ రాసిన హర్‌ప్రీత్ సింగ్‌ను సిమ్లాలో అనుమతి లేకుండా నిరసన చేపట్టినందుకు కొద్ది రోజుల కిందట పోలీసులు అరెస్ట్ చేశారని పీటీఐ నివేదిక పేర్కొంది. ఆ తర్వాత కొద్దిసేపటికే అతను బెయిల్‌పై విడుదల అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmers Protest, New Agriculture Acts, PM Narendra Modi