ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మళ్లీ రక్తపుటేరులు పారాయి. శనివారం మధ్యాహ్నం బీజాపూర్ జిల్లాలో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మందికి పైగా భద్రతా సిబ్బంది మరణించారు. ఇద్దరు మావోయిస్టులు కూడా హతమయ్యారు. మరో 10 మంది జవాన్లకు గాయాలయినట్లు ఛత్తీస్‌గఢ్ డీజీపీ డీఎం అవస్థి తెలిపారు. బీజాపూర్ జిల్లాలోని తార్రెమ్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. చనిపోయిన ఆరుగురు డీఆర్‌జీ, ఇద్దరు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. గాయపడ్డ జవాన్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని సమాచారం.
బీజాపూర్ జిల్లాలోని తార్రెమ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాల ద్వారా అధికారులకు సమాచారం అందించింది. ఈ క్రమంలోనే అడవులను భద్రతా సిబ్బంది జల్లెడ పడుతున్నారు. శనివారం కూంబింగ్ నిర్వహిస్తుండగా మధ్యాహ్నం 1 గంటల సమయంలో భద్రతా సిబ్బందికి మావోయిస్టులు తారసపడ్డారు. తప్పించుకునే క్రమంలో భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. వెంటనే జవాన్లు కూడా కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మందికి పైగా భద్రతా సిబ్బందితో పాటు ఇద్దరు మావోయిస్టులు మరణించారు. ప్రస్తుతం తార్రెమ్ అటవీ ప్రాంతం మొత్తం భద్రతా దళాలు మోహరించాయి. ఇరు వర్గాల మధ్య ఇంకా ఎన్‌కౌంటర్ జరుగుతున్నట్లు తెలిసింది.
ఎన్‌కౌంటర్ నేపథ్యంలో రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ డీజీపీ డీఎం అవస్థి, యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ అడిషనల్ డీజీ అశోక్ జునేజా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. బీజాపూర్ ఎన్‌కౌంటర్‌పై చర్చించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chhattisgarh, Encounter, Maoist attack, Maoists