కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపులు ఫలించనున్నాయి. ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్న వారి నిరీక్షణకు తెరపడనుంది. డీఏ ఎరియర్స్ చెల్లింపుల రూపంలో కొత్త సంవత్సరం ఆరంభానికి ముందే వారికి తీపి కబురు అందనుంది. కరోనా మహమ్మారి కారణంగా కొన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న డీఏ రియర్లను క్రిస్మస్ కానుకగా చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై క్రిస్మస్కు ముందే అంటే డిసెంబర్ 24వ తేదీన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా డియర్ నెస్ అలవెన్స్(డీఏ), డియర్నెస్ రిలీఫ్(డీఆర్) చెల్లించేందుకు కేంద్రం ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం.
33లక్షలకు పైగా ఉద్యోగులకు ప్రయోజనం..
కరోనా మహమ్మారి కారణంగా 18 నెలలుగా డీఏ ఎరియర్లు పెండింగ్ లో పడిపోయాయి. 2020 మే నుంచి 2021 జూన్ 30 వరకు డీఏ పెంపును కేంద్రం నిలుపుదల చేసింది. ఆ సమయానికి సంబంధించి.. ఉద్యోగులకు ఎటువంటి ఎరియర్లు చెల్లించేది లేదని కేంద్రం అప్పట్లో తేల్చి చెప్పింది. అయితే ఉద్యోగులతో పాటు ఇండియన్ పెన్షనర్స్ ఫోరమ్(బీఎంస్) కూడా పలు దఫాలుగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాసింది.
వీటిపై స్పందించిన ప్రధాని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని ఫైనాన్స్ మినిస్ట్రీ ఆమోదించి, గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఉద్యోగుల పంట పండినట్లే. పెద్ద మొత్తంలో వారి ఖాతాల్లో నగదు జమవుతుంది. దీని ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 33 లక్షలకు పైగా ఉద్యోగులకు మేలు చేకూరుతుందని ఏడో వేతన సంఘం రిపోర్టులు చెబుతున్నాయి.
కాగా, గత అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 31 శాతం వరకు కేంద్రం పెంచిన విషయం తెలిసిందే. దీని ద్వారా 48 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందారు. సాధారణంగా ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్‌ను పెంచుతుంది. ప్రభుత్వ రంగ ఉద్యోగుల స్థూల జీతంలో అధిక భాగాన్ని డీఏ భర్తీ చేస్తుంది. ప్రధానంగా ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి ఈ మొత్తాన్ని ఉద్యోగులకు ఇస్తారు.
చెల్లింపులు ఇలా..
ఈ సందర్భంగా నేషనల్ కౌన్సిల్ జేసీఎం శివ గోపాల్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు ఎరియర్ల చెల్లింపు ఎలా ఉంటుందో వివరించారు. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు.. లెవల్-1 పే స్కేల్ కలిగిన ఉద్యోగులకు రూ. 11,880 నుంచి రూ. 37,554 వరకు, లెవెన్-13 ఉద్యోగులకు రూ. 1,23,100 నుంచి రూ. 2,15,900 వరకు, లెవెల్-14 పేస్కేల్ కలిగిన వారికి రూ. 1,44,200 నుంచి రూ.2,18,200 వరకు డీఏ ఎరియర్లు ఉంటాయన్నారు. అయితే ఈ పెండింగ్ డీఏ పెంపు విషయం కేబినేట్ సెక్రటరీతో సమావేశం అనంతరం దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతుండటంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.