75th Independence Day: 75వ స్వాతంత్ర్య దినోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీ... ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ... ఆజాదీ కా అమృత మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశంకోసం పోరాడి త్యాగాలు చేసిన మహనీయుల కీర్తిని కొనియాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... ఈ కరోనా సమయంలో... కరోనా వారియర్లు ప్రజా సేవ చేస్తున్నారని మెచ్చుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి అండగా ఉన్నాయన్నారు. ఒలింపిక్స్‌లో అద్భుత విజయాలు సాధించిన క్రీడాకారులకు చప్పట్లతో ఘనస్వాగతం పలుకుదామంటూ... స్వయంగా ప్రధానమంత్రి చప్పట్లు కొట్టారు. ప్రతి సంవత్సరం ఆగస్ట్ 14న విభజన భయానక జ్ఞాపకాల దినోత్సవం జరుపుకుందామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... అప్పటి త్యాగాలు, పరిస్థితులను స్మరించారు.
ఈ కరోనా సమయంలో భారత్ స్వయంగా కరోనా వ్యాక్సిన్ తయారుచేయడమే కాక... ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇండియా చేపట్టిందన్నారు. 54 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని అన్నారు. మన దేశంలో జనాభా సంఖ్య ఎక్కువన్న మోదీ... ఎన్నో సవాళ్లు ఉన్నాయన్నారు. అయినా సరే ముందుకు వెళ్తున్నామన్నారు. సరికొత్త సంకల్పంతో ముందుకెళ్దామని పిలుపునిచ్చారు మోదీ. నయా భారత్ సృష్టించేందుకు ఇది అమృత కాలం అన్నారు మోదీ. అందరితో, అందరి విశ్వాసంతో, అందరి అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నామన్న మోదీ... అందరూ ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు.
వ్యవసాయంలో కూడా విప్లవాత్మక మార్పులు రావాలన్న ప్రధాని మోదీ... రైతులు లాభాలు పొందాలన్నారు. ఈ దిశగా బలమైన అడుగులు పడాలన్నారు. నానాటికీ కమతాల సంఖ్య తగ్గిపోతూ... రైతులు చిన్న రైతులు అయిపోతున్నారన్న ప్రధాని మోదీ... వారిని దృష్టిలో పెట్టుకొని... ఫసల్ భీమా యోజన, కనీస మద్దతు ధర, కిసాన్ క్రెడిట్ కార్డ్, సోలార్ పవర్ పథకాలు ఇలా ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్నామన్నారు. త్వరలో గిడ్డంగుల సౌకర్యాలు కూడా కల్పిస్తామన్నారు. చిన్న రైతులు బాగుపడితేనే దేశం బాగుపడుతుందన్నారు మోదీ.
అంతకుముందు రాజ్‌ఘాట్ దగ్గర మహాత్మా గాంధీ సమాధికి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఎర్రకోటకు వెళ్లిన ప్రధానమంత్రికి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్... ఎర్రకోటకు స్వాగతం పలకగా.... త్రివిధ దళాలు... గార్డ్ ఆఫ్ హానర్ ప్రకటించాయి. ఆ తర్వాత ప్రధాని మోదీ... ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసారి ఒలింపిక్స్‌లో పాల్గొన్న 32 అథ్లెట్లు ఎర్రకోట దగ్గర పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనడం విశేషం.
స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఎర్రకోట దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. ఎంట్రీ దగ్గర షిప్పింగ్ కంటైనర్లు ఉన్నాయి. 350 సీసీ కెమెరాలతో పాటు 2 ప్రత్యేక పోలీసు కంట్రోల్ రూమ్‌లు ఉన్నాయి. ఎర్రకోట దగ్గర 5 వేల మంది సిబ్బందితో భద్రత ఉంది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి కాబట్టి ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Independence Day 2021