మరో గ్యాస్ లీక్ ఘటన.. ఛత్తీస్‌గఢ్‌లో ఏడుగురు కార్మికులకు అస్వస్థత

పేపర్ మిల్లులో గ్యాస్ లీకై ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

news18-telugu
Updated: May 7, 2020, 3:28 PM IST
మరో గ్యాస్ లీక్ ఘటన.. ఛత్తీస్‌గఢ్‌లో ఏడుగురు కార్మికులకు అస్వస్థత
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
  • Share this:
విశాఖపట్టణంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన మరవక ముందే ఛత్తీస్‌గఢ్‌లో మరో ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రాయ్‌గఢ్‌లోని పేపర్ మిల్లులో గ్యాస్ లీకై ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. లాక్‌డౌన్ 3లో సడలింపులు ఇవ్వడంతో పలు పరిశ్రమలు తెరచుకున్నాయి. ఈ క్రమంలో రాయ్‌గఢ్‌లోని పేపర్ మిల్లు కూడా ప్రారంభమయింది. గురువారం మధ్యాహ్నం మిల్లులోని ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ఏడుగురు కార్మికులు వెళ్లారు. ట్యాంకులోకి దిగి శుభ్రం చేస్తున్న క్రమంలో గ్యాస్ లీకై అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు, పోలీసులు అక్కడికి చేరుకొని.. కార్మికులను ఆస్పత్రికి తరలించారు. ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల ప్రజలను ఖాళీ చేయించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, గురువారం తెల్లవారుజామున విశాఖపట్టణంలో మహా విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆర్ ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టెరీన్ గ్యాస్ లీకై... 11 మంది చనిపోయారు. వందలాది మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విషవాయువును పీల్చడంతో స్థానికులు ఎక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విషవాయువు ధాటికి పశుపక్షాదులు సైతం చనిపోయాయి. చుట్టుపక్కల ఉన్న పలు చెట్లు మాడిపోయాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ, సీఎం జగన్ సహా పలు రాష్ట్రాల నేతలు, సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐతే ఈ ఘటన మరవక ముందే ఛత్తీస్‌గఢ్‌లోనూ పేపర్ మిల్లులో గ్యాస్ లీకై ఏడుగురు అస్వస్థతకు గురవడం తీవ్ర కలకలం రేపింది.
Published by: Shiva Kumar Addula
First published: May 7, 2020, 3:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading