news18-telugu
Updated: April 2, 2019, 5:40 PM IST
ప్రతీకాత్మక చిత్రం
కుక్క తోక వంకరలా పాకిస్తాన్ రెచ్చిపోతూనే ఉంది. సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని యథేచ్చగా ఉల్లంఘిస్తోంది. భారత ఆర్మీ పోస్టులను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు తెగబడుతోంది. మంగళవారం రాజౌరి, పూంచ్ జిల్లాల్లోని సరిహద్దుల్లో మోర్టార్ షెల్స్‌తో దాడులు చేశాయి పాక్ బలగాలు. ఐతే పాకిస్తాన్ కవ్వింపులకు భారత సైన్యం ధీటుగా జవాబిస్తోంది. పాకిస్తాన్ పోస్టులను లక్ష్యంగా చేసుకొని ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో 7 పాకిస్తానీ మిలటరీ పోస్టులు ధ్వంసమైనట్లు భారత సైన్యాధికారులు వెల్లడించారు. పలువురు పాక్ జవాన్లు చనిపోయారని తెలిపారు.
పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ మాత్రం భారత్‌పై నిందలు వేస్తోంది. భారత సైన్యమే మొదట దాడులు చేసిందని...కాల్పుల్లో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారని ఓ ప్రకటనలో పేర్కొంది.
సోమవారం పూంచ్ జిల్లాలోని ఎల్వోసీ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ రెచ్చిపోయింది. భారత గ్రామాలు, ఆర్మీ పోస్టులే లక్ష్యంగా షెల్లింగ్‌తో విరుచుకుపడింది. పాక్ బలగాలు కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ సహా ముగ్గురు చనిపోయారు. మరో 24 మందికి గాయాలయ్యాయి. రాజౌరి, పూంచ్ జిల్లాల్లో మంగళవారం ఉదయం వరకు షెల్లింగ్ కొనసాగింది. ఐతే భారత దళాలు ధీటుగా స్పందించి 7 పాకిస్తాన్ పోస్టులను ధ్వంసంచేసింది. దాంతో తోకముడిచిన పాకిస్తాన్ దళాలు షెల్లింగ్ ఆపేశాయి. ప్రస్తుతం సాధారణ పరిస్థితులే ఉన్నా..అటు వైపు నుంచి ఏ క్షణమైనా కాల్పులు జరిగే అవకాశముందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు.
కాల్పుల నేపథ్యంలో ఎల్వోసీ పరిధిలోని గ్రామాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు స్థానికులు. అటు అధికారులు సైతం పలు గ్రామాలకు హెచ్చరికలు పంపారు. ముఖ్యంగా రాజౌరీ, పూంచ్ జిల్లాల్లోని సరిహద్దుల్లోని ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని సూచించారు. స్కూళ్లకు సైతం సెలవులు ప్రకటించారు.
First published:
April 2, 2019, 5:26 PM IST