పార్లమెంట్ క్యాంటీన్‌లో అర్ధశతాబ్దపు ఆనవాయితీ ముగిసింది.. ఇకపై సరికొత్తగా

52 సంవత్సరాలుగా పార్లమెంటు సభ్యులకు ఆహారాన్ని అందిస్తోన్న ఇండియన్ రైల్వేస్, ఆ పని నుంచి తప్పుకోనుంది.

news18-telugu
Updated: October 23, 2020, 5:22 PM IST
పార్లమెంట్ క్యాంటీన్‌లో అర్ధశతాబ్దపు ఆనవాయితీ ముగిసింది.. ఇకపై సరికొత్తగా
పార్లమెంటు భవనం
  • Share this:
52 సంవత్సరాలుగా పార్లమెంటు సభ్యులకు ఆహారాన్ని అందిస్తోన్న ఇండియన్ రైల్వేస్, ఆ పని నుంచి తప్పుకోనుంది. నవంబర్ 15న నార్త్ రైల్వే జోన్ పార్లమెంట్ క్యాంటీన్ బాధ్యతలను టూరిజం విభాగానికి అప్పగించనుంది. ఇప్పటి నుంచి ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ITDC) పార్లమెంటు సభ్యులకు భోజనం అందించనుంది. 1968 నుంచి పార్లమెంటు క్యాంటీన్ ద్వారా ఎంపీలకు ఆహారాన్ని అందిస్తున్న నార్త్ రైల్వే జోన్‌కు లోక్‌సభ సెక్రటేరియట్ ఒక లేఖ రాసింది. పార్లమెంటు ప్రాంగణం నుంచి సంస్థ ఖాళీ చేయాలని అందులో తెలిపింది. పార్లమెంట్ హౌస్ ఎస్టేట్లోని క్యాటరింగ్ యూనిట్ల విధులను నవంబర్ 15 లోగా ఐటీడీసీ చేపట్టాలని లేఖలో పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు.

గతేడాది నుంచే ఏర్పాట్లు

కంప్యూటర్లు, ప్రింటర్లు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ఫర్నిచర్, ఇతర సామగ్రిని నార్తర్న్ రైల్వేస్ ITDCకి అప్పగించవచ్చని లోక్‌సభ సెక్రటేరియట్ లేఖలో పేర్కొంది. గత సంవత్సరమే క్యాంటీన్ నిర్వహణ కోసం కొత్త సంస్థను వెతికే ప్రక్రియ మొదలైంది. ఈ సంవత్సరం జూలై నెలలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్, ఐటీడీసీ అధికారులతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. అప్పుడే టూరిజం సంస్థకు క్యాంటీన్ బాధ్యతలు అప్పగిస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఆహార నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తమకు ఆదేశాలు అందినట్టు ఐటీడీసీ అధికారులు తెలిపారు.

స్పీకర్ ప్రత్యేక చొరవ
ప్రస్తుతం ఈ క్యాంటీన్ ద్వారా ప్రతి పార్లమెంట్ సెషన్లో సుమారు 5,000 మందికి ఆహారాన్ని అందిస్తున్నారు. క్యాంటీన్ మెనూలో భోజనం, సాయంత్రం స్నాక్స్ కోసం మొత్తం 48 ఆహార పదార్థాలు ఉన్నాయి. గతంలో 17వ లోక్‌సభ ఫుడ్ మేనేజ్‌మెంట్‌పై సంయుక్త కమిటీని నియమించింది. ఈ కమిటీ పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో క్యాటరింగ్ ఏర్పాట్లకు సంబంధించిన విషయాలను పర్యవేక్షించాలని నిర్ణయించినప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు క్యాంటీన్లో మెరుగైన, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, ఆహారంపై సబ్సిడీలకు ముగింపు పలకాలని ఆయన అధికారులను ఆదేశించారు. సబ్సిడీలను ఆపడం వల్ల పార్లమెంటుకు సుమారు రూ .17 కోట్ల వరకు ఆదా అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 23, 2020, 5:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading