పాకిస్తాన్ దుశ్చర్యకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కాశ్మీర్‌లోని ఎల్ఓసీ వద్ద పాకిస్తాన్ రేంజర్లు జరిపి కాల్పులు ఐదుగురు సైనికులు, నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది వరకు గాయపడ్డారు. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద మూడు చోట్ల ఈ ఘటనలు జరిగాయి. ఈ క్రమంలో భారత్ - పాకిస్తాన్ మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. పరస్పరం మోర్టార్లు, చిన్న తరహా ఆయుధాలను ప్రయోగించినట్టు తెలిసింది. సరిహద్దుల్లో ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో అత్యధికంగా యూరీ సెక్టార్లో ఓ మహిళ సహా ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లు వీరమరణం చెందారు. ఇక నౌగాం సెక్టార్లో ఓ బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ చనిపోయాడు. ముగ్గురు పౌరులు గాయపడ్డారు. తాంగ్ధర్లో ఇద్దరు జవాన్లు గాయపడినట్టు అధికారులు చెప్పారు. పూంఛ్‌లోని సౌజియాన్లో మరో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. గ్రామంలో భారీ ఎత్తున బుల్లెట్ల వర్షం కురిసిందని స్థానికులు చెప్పారు.
మరోవైపు భారత సైనికులు జరిపిన ఎదురుదాడిలో 7-8 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులు హతమయ్యారని, 10 నుంచి 12 మంది గాయపడ్డారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. అలాగే, సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ బంకర్లు, ఫ్యూయల్ డంప్స్, లాంచ్ ప్యాడ్స్‌ను భారత సైన్యం ధ్వంసం చేసినట్టు పేర్కొంది. మాచిల్ సెక్టార్లో ఉగ్రవాదులను చొరబడేందుకు చేసిన ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొట్టడంతో పాకిస్తాన్ ఆర్మీ ఇలా కాల్పులకు తెగబడిందని ఇండియన్ ఆర్మీ తెలిపింది.
శుక్రవారం (నవంబర్ 13) ఎల్ఓసీలోని కేరాన్ సెక్టార్లో విధులు నిర్వహిస్తున్న భారత బలగాలకు... కొందరు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇండియాలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానం కలిగింది. ఆ ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొట్టింది. దీన్ని జీర్ణించుకోలేని పాకిస్తాన్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ భారీ ఎత్తున బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో భారత్‌కు చెందిన సోల్జర్లు, సాధారణ పౌరులు చనిపోయారు. పాకిస్తాన్‌కు దీటైన బదులిస్తున్నామని భారత్ ఆర్మీ స్పష్టం చేసింది. ఈ వారంలో పాకిస్తాన్ దుర్మార్గులు చొరబాటుకు ప్రయత్నించడం ఇది రెండోసారి. నవంబర్ మొదటి వారంలో కూడా పాకిస్తాన్ నుంచి ముష్కరులు భారత్‌లోకి చొరబడే ప్రయత్నం చేశారు. మాచిల్లో ముగ్గురు మిలిటెంట్లను భారత సైన్యం మట్టుబెట్టింది. భారత్ - పాక్ సరిహద్దు ఫెన్సింగ్‌కు కిలోమీటర్ దూరంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. అప్పుడు జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు సైనికులు కూడా అమరులయ్యారు. ‘జమ్మూకాశ్మీర్లోకి టెర్రరిస్టులను ప్రవేశపెట్టేందుకు పాకిస్తాన్ చేసే అన్ని కుట్రలను భారత్ ఆర్మీ తిప్పికొడుతుంది.’ అని ఇండియన్ ఆర్మీ అధికారులు తెలిపారు.
ఈ ఏడాది ఎల్ఓసీ వద్ద అత్యధిక సార్లు కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘించింది పాకిస్తాన్. ఇప్పటి వరకు సుమారు 4000 సార్లు కాల్పులకు తెగబడింది. వాటిలో అత్యధికంగా పిర్ పంజల్, పూంచ్, రాజౌరీ జిల్లాలో కాల్పులు జరిగాయి.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.