మహిళలపై అకృత్యాలు, అత్యాచారాలు, హింస ఉదంతాలు (Harassment on Women) పెరిగిపోతూ, కఠిన చట్టాలు పుట్టుకొస్తుండగా.. అదే మహిళల్లో మెజార్టీ శాతం మంది గృహ హింస పట్ల ఆమోదవైఖరిని వెలిబుచ్చడం షాకింగ్ పరిణామంగా మారింది. దేశంలో మహిళల రక్షణకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక చట్టాలు చేస్తుంటే.. మహిళలు మాత్రం కొన్ని సందర్భాల్లో గృహ హింస పర్వాలేదని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (National Family Health Survey)లో చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.
కేంద్రం సర్వేలో షాకింగ్ అంశాలు: ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్)–5లో చాలా మంది భార్యలు కొన్ని సందర్భాల్లో తమ భర్తలు చేయి చేసుకోవడాన్ని సమర్థించడం గమనార్హం. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు 80 శాతానికిపైగా భర్తలు కొట్టడాన్ని సమర్థించడం షాకింగ్ గా అనిపించక మానదు.
భర్తకు చెప్పకుండా బయటకు వెళ్లడం, ఇంటిని, పిల్లలను నిర్లక్ష్యం చేయడం, భర్తతో వితండవాదం, నమ్మకద్రోహం, అత్తమామలను అగౌరవ పరచడం తదితర సందర్భాల్లో భర్త అవసరమైతే భార్యపై చేయి చేసుకోవచ్చని దేశ వ్యాప్తంగా 45.4 శాతం మంది మహిళలు, 44 శాతం మంది పురుషులు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని గత సర్వేతో పోలిస్తే మహిళల్లో 7 శాతం తగ్గగా, పురుషుల్లో రెండు శాతం పెరిగింది.
తన్నినా పర్వాలేదనడంలో తెలుగువాళ్లే టాప్: నిర్దిష్ట కారణాలతో భార్యను కొట్టడాన్ని సమర్థించే మహిళల్లో తెలంగాణ (83.8 శాతం) అగ్ర స్థానం ఉండగా, తోటి తెగులు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ (83.6 శాతం) రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటకలో అత్యధికంగా పురుషులు (81.9 శాతం) భార్యలపై చేయి చేసుకోవచ్చన్నారు. హిమాచల్ ప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయూలో మాత్రం అతి తక్కువ మంది భార్యలు మాత్రమే భర్తలు కొట్టడాన్ని సమర్థించారు.
వయసు పెరిగే కొద్దీ భర్తలు అలా, భార్యలు ఇలా: భర్తలు చేయి చేసుకోవచ్చనే అభిప్రాయం మహిళల్లో వయసుతో పాటు పెరుగుతుండగా, పురుషుల్లో తగ్గుతోంది. భర్తలు దాదాపు 25 శాతం భార్యలను చెంప దెబ్బ కొడుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేర్కొంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా భర్యను కొట్టడంలో తప్పులేదనే అభిప్రాయం వ్యక్తమైంది. అత్తమామలను సరిగా చూసుకోని సందర్భంలో భార్యను కొట్టొచ్చని 32 శాతం మహిళలు, 31 శాతం పురుషులు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Domestic Violence, Family, Health minister, Husband, Survey, Wife