3D Organs : ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అన్ని రకాల వస్తువులను యంత్రాలు తయారు చేస్తున్నాయి. మానవ అవయవాలను మాత్రం సాటి మనుషుల నుంచి సేకరించాల్సిందే. కొన్ని రకాల చికిత్సల్లో కృత్రిమ అవయవాలు ఉపయోగిస్తారు. అయితే ఓ స్టార్టప్ కంపెనీ(Start-up) మనిషి అవయవాలు తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. అధిగమించాల్సిన సవాళ్లు చాలా ఉన్నా.. కచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ భారతీయ స్టార్టప్‌నకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
బయో ప్రింటర్ కనిపెట్టారు
ఈ స్టార్టప్ పేరు అవయ్ బయో సైన్సెస్(Avay Biosciences). కరోనా తరువాత బెంగళూరులో పుట్టిన స్టార్టప్ ఇది. ఈ కంపెనీలోని యువ వ్యాపారవేత్తలు కొత్తగా ఓ 3D బయో ప్రింటర్ని తయారు చేశారు. దాని పేరు ‘మిటో ప్లస్’(Mito Plus). ఇది ఎట్ ఏ టైం ఒక పొర మానవ కణజాలాన్ని ప్రింట్ చేయగలదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరులో ఈ ప్రింటర్‌ను విజయవంతంగా టెస్ట్ చేశారు. ఇప్పుడు మనిషి కణజాలాన్ని ప్రింట్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
మానవ అవయవాల్ని ప్రింట్ చేయవచ్చా?
ఆర్టిఫిషియల్‌గా మానవ కణజాలాన్ని ప్రింట్ చేసే ఈ 3D బయో ప్రింటర్ దాదాపుగా సాధారణ 3D ప్రింటర్ లాగానే పనిచేస్తుంది. మామూలుగా సాధారణ 3D ప్రింటర్ పని చేయాలంటే అందులో ప్లాస్టిక్, మెటల్, పౌడర్లలాంటి వాటిని ఇంక్గా వాడతారు.. బయో ప్రింటర్లో అయితే మానవ కణాలు, బయో మెటీరియల్‌తో తయారు చేసిన వాటిని బయో ఇంక్గా ఉపయోగిస్తారు. దీంతో ఇది పూర్తిగా చర్మంలా పని చేయగల కొత్త మానవ కణజాల పొరలను ప్రింట్ చేయగలుగుతోంది. దీన్ని మరింత అభివృద్ది చసి ఒక పూర్తి హ్యూమన్ ఆర్గాన్ని తయారు చేసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.
ఇదో అద్భుతమైన గిప్ట్ : సీఈఓ
ప్రస్తుతం ఉన్న అవసరాలను పరిశీలిస్తే ఈ 3డి బయో ప్రింటర్ అనేది మానవజాతి అందించిన గొప్ప బహుమతి అని సంస్థ సీఈఓ(CEO)మనీష్ అమిన్ చెప్పారు. ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ఈ అంశంపై పని చేసే కంపెనీలు వంద వరకూ ఉన్నాయని పేర్కొన్నారు. తమ స్టార్టప్ ఇప్పటికే ఐఐటీ మద్రాస్, హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER), బిట్స్ పిలానీ(BITS Pilani)లతో కలిసి పని చేసిందని తెలిపారు. వీరు తమ ప్రింటర్లను పరిశోధనల నిమిత్తం వాడుకుంటున్నారని తెలిపారు. తమ సంస్థను ప్రారంభించిన రెండు సంవత్సరాలలోనే కొత్త మందుల ఆవిష్కరణలో, కృత్రిమ అవయవాల మార్పిడిలో ముఖ్యంగా చర్మంపై తాము పని చేస్తున్నామన్నారు. కాలిన గాయాలతో బాధపడేవారికి తాము చర్మాన్ని ప్రింట్ చేసి ఇస్తున్నామని మనీష్ చెప్పుకొచ్చారు. క్సాన్సర్ బయాలజీ, కాస్మొటాలజీల్లో తమ ఉత్పత్తులకు డిమాండ్ ఉందని తెలిపారు. ఫార్మాస్యూటికల్ రంగం నుంచి తమకు డిమాండ్ పెరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. మనుషుల్లో అవయవ మార్పిడి కోసం పూర్తిగా పని చేసే అవయవాలను రూపొందించడానికి మాకు ముందు చాలా సవాళ్లు ఉన్నాయని, వాటిని అధిగమించడానికి, లక్ష్యం చేరుకోవడానికి చాలా దూరంలో ఉన్నామని చెప్పారు. అందుకనే మేం మా స్టార్టప్‌కి అవయ్ అనే పేరు పెట్టామని తెలిపారు. అవయ్ అంటే సంస్కృతంలో 'అవయవం' అని అర్ధమని అమిన్ చెప్పుకొచ్చారు.
Surgery: ఓ వ్యక్తి కడుపులో 187 నాణేలు.. ఆపరేషన్ చేసి 1.5 కేజీల కాయిన్స్ తొలగించిన వైద్యులు
అంతులేని నిరీక్షణల తర్వాత
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే డెంటల్, ఆర్థోపెడిక్ రంగాల్లో విజయవంతంగా 3D ప్రింటింగ్ టెక్నాలజీ పని చేస్తోంది. రీసర్చర్లు హార్ట్ పేషెంట్లకు కార్డిక్ ప్యాచ్‌లు, కాలిన గాయాలకు ప్రింట్ చేసిన చర్మం అమర్చడం లాంటివి చేస్తున్నారు. అయితే అంతంకంటే ఇంకొంచెం ముందుకు వెళ్లడమే ప్రస్తుతం బయోటెక్నాలజీ కంపెనీల ముందు సవాలుగా ఉంది. దీన్ని క్రాక్ చేయగలిగితే బయో ప్రింటింగ్ అనేది హెల్త్‌కేర్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తేగలదు. అవయవ మార్పిడుల కోసం లక్షల మంది ఎదురుచూపులకు ఇది సమాధానం కాగలదు. కృత్రిమ అవయవాలను అభివృద్ధి చేయడానికి బయోప్రింటర్లు ముందు కాస్ట్ ఎఫెక్టివ్‌గా అందుబాటులోకి రావాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్టార్టప్‌లు, పరిశోధన సంస్థలు పని చేస్తే అది భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
బయో ప్రింటింగ్ది గ్రోయింగ్ మార్కెట్
బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (BIRAC) ఇప్పుడు మన దేశంలో కూడా ఇలాంటి బయోటెక్ స్టార్టప్‌లు పెరుగుతున్నట్లు గుర్తించింది. ఇది ప్రాథమికంగా ఇలాంటి స్టార్టప్‌లకు ఫండ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు ఈ బయో ప్రింటింగ్ మార్కెట్ విలువ ప్రపంచ వ్యాప్తంగా 1.3 బిలియన్ డాలర్లుగా ఉంది. 2027 నాటికి అది 3.3 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనాలు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.