మహారాష్ట్రలో వర్షాల బీభత్సం.. కొండచరియలు విరిగిపడి ఒకే గ్రామంలో 75 మంది గల్లంతు

ప్రతీకాత్మక చిత్రం

తాల్యే గ్రామంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కొండ చరియల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాయంత్రం సమయంలో అందరూ ఇళ్లల్లో ఉన్న సమయంలో కొండ చరియలు విరిగిపడడంతో చాలా మంది వాటి కింద చిక్కుకుపోయారు.

 • Share this:
  మహారాష్ట్రలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.  ముఖ్యంగా కొంకణ్ ప్రాంతం చిగురుటాకులా వణికిపోతోంది. భారీ వర్షాల ధాటికి వాగులు వంకలు ఉప్పొంగి ప్రహిస్తున్నాయి. చాలా గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. మరోవైపు కొండ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి.  తాజాగా రాయ్‌గఢ్ జిల్లా మహద్ తాలుకా తాల్యే గ్రామంలో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 32 ఇళ్లు వాటి కింద పూడుకుపోయాయి. కొండ చరియల కింద 75 మంది స్థానికులు చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై గ్రామ సర్పంచ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సహాయక చర్యల కోసం శుక్రవారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారు.

  ప్రస్తుతం తాల్యే గ్రామంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కొండ చరియల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాయంత్రం సమయంలో అందరూ ఇళ్లల్లో ఉన్న సమయంలో కొండ చరియలు విరిగిపడడంతో చాలా మంది వాటి కింద చిక్కుకుపోయారు. ఇప్పటికే పలువురు మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఐతే మట్టి పెళ్లల కింద ఖచ్చితంగా ఎంత మంది చిక్కకున్నారన్న వివరాలు తెలియడం లేదు. దాదాపు 75 మంది ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

  మహారాష్ట్రలోని రత్నగిరి, రాయగఢ్, థానే, పాల్‌ఘర్ జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఓ వైపు వరదలు, మరోవైపు విరిగిపడుతున్న కొండ చరియలతో జనం వణికిపోతున్నారు. జల దిగ్బంధంలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నేవీ, ఆర్మీ సాయం కోరింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఎన్టీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ, కోస్ట్ గార్డ్ దళాలు మోహరించాయి. హెలికాప్టర్లు, పడవల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మహారాష్ట్రలో వర్షాల పరిస్థితిపై ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. రాష్ట్రంలో తాజా పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వరద సహాయక చర్యల్లో కేంద్రం తరపున అన్ని విధాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
  Published by:Shiva Kumar Addula
  First published: