మార్చ్ 25న దేశమంతా ట్రిపుల్ ఆర్ (RRR) మేనియా నడుస్తుంది. అన్నిచోట్లా ఈ సినిమాను వీలైనంత త్వరగా చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు. అందుకే థియేటర్స్ దగ్గర ఎక్కడ చూసినా కూడా అభిమానుల హంగామానే కనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే బ్యానర్లు కట్టి సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సందడి వాతావరణంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా వి.కోట దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ట్రిపుల్ ఆర్ సినిమా అభిమానులు మృత్యువాత పడ్డారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా బెనిఫిట్ షోకి వెళ్తున్న యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. దీనికి ముందే వాళ్లు థియేటర్స్ దగ్గర బ్యానర్స్ కట్టారని తెలుస్తుంది. ఆ తర్వాత బెనిఫిట్ షోకు వెళ్తుంటే మార్గ మధ్యలో యాక్సిడెంట్ అయింది. దాంతో వాళ్లు అక్కడికక్కడే చనిపోయారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల సందర్భంగా అర్ధరాత్రి బెనిఫిట్ షో టికెట్ల కోసం వి.కోటకు వెళ్లారు.
తమిళనాడు బోర్డర్‌లోని ఓ ఊరు నుంచి ఈ కుర్రాళ్లు వచ్చారు. థియేటర్‌కు వస్తున్న సమయంలోనే ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు అర్థమవుతుంది. మృతులు రామకుప్పం, వీ. కోటకు చెందిన యువకులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్నారు. ఏదేమైనా సినిమా చూడాలని బయల్దేరిన కుర్రాళ్లు.. ఇలా దుర్మరణం పాలవడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.