హోమ్ /వార్తలు /జాతీయం /

కోర్టుల్లో 3.4కోట్ల పైచిలుకు పెండింగ్ కేసులు.. సత్వర న్యాయం ఇక 'కల'యేనా..?

కోర్టుల్లో 3.4కోట్ల పైచిలుకు పెండింగ్ కేసులు.. సత్వర న్యాయం ఇక 'కల'యేనా..?

సుప్రీం కోర్టు(File)

సుప్రీం కోర్టు(File)

దేశంలో జనాభా నిష్పత్తికి అనుగుణంగా కోర్టులు లేకపోవడమే పెండింగ్ కేసులకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. న్యాయమూర్తులను, ప్రధాన న్యాయమూర్తిని నియమించాలని న్యాయవాదులే రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం దేశంలో నెలకొంది.

  న్యాయం ఆలస్యమవడం కూడా అన్యాయమే అన్నది చాలామంది వాదన. భారత్‌లో పరిస్థితి ఇందుకు సరిగ్గా సరిపోతుంది. అందుకే న్యాయ వ్యవస్థపై జోకులు వేసే పరిస్థితి కూడా వచ్చింది. కోర్టు కేసులో ఓడిన వాడు కోర్టులోనే ఏడిస్తే.. గెలిచనవాడు ఇంటికొచ్చి ఏడుస్తాడన్న జోకులు పుట్టుకొచ్చాయి. దేశంలోని కోర్టుల్లో కోట్లకొద్ది కేసులు పెండింగ్‌లో ఉండటమే ఈ పరిస్థితికి కారణమైంది. చాలా కేసుల్లో న్యాయం ఆలస్యమవుతుండటంతో.. అది దోషులకు వరంగా, బాధితులకు శాపంగా మారుతోంది. కోర్టు మెట్లెక్కితే ఏళ్లు గడిచినా వ్యవహారం ఎటూ తేలదు అన్న అభిప్రాయం సామాన్య జనంలో నాటుకుపోయింది.


  ఇదంతా ఇప్పుడెందుకు అంటే.. జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త అయిన కంచన్ గుప్తా దేశంలో పెండింగ్ కేసుల డేటాను తాజాగా బయటపెట్టారు. దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో కలిపి 3,44,70,817 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇందులో సుప్రీంకోర్టులో 57,346 కేసులు పెండింగ్‌లో ఉండగా.. హైకోర్టుల్లో 47,19,843, కింది కోర్టుల్లో 2,96,93,988 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు వెల్లడించారు.


  దేశంలో జనాభా నిష్పత్తికి అనుగుణంగా కోర్టులు లేకపోవడమే పెండింగ్ కేసులకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అలాగే కేసుల సంఖ్యకు, దేశంలో ఉన్న న్యాయవాదులు, న్యాయమూర్తుల సంఖ్యకు ఏమాత్రం పొంతన లేకపోవడం,న్యాయమూర్తుల నియామకంలో జాప్యం వల్ల.. ఉన్న న్యాయమూర్తుల పైనే పనిభారం పెరగడం కూడా పెండింగ్ కేసులు గుట్టలా పేరుకుపోవడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. న్యాయమూర్తులను, ప్రధాన న్యాయమూర్తిని నియమించాలని న్యాయవాదులే రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం దేశంలో నెలకొంది. ఇప్పటికైనా న్యాయ వ్యవస్థలో నియామకాలను స్పీడప్ చేయకపోతే దేశంలో సత్వర న్యాయం కూడా ఓ కలగానే మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు.
  First published:

  Tags: Delhi High Court, High Court, Supreme Court

  ఉత్తమ కథలు