news18-telugu
Updated: June 24, 2020, 11:05 AM IST
పార్లమెంట్ (File)
ఈమధ్య జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీల చరిత్రను తిరగేస్తే... కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఎంపీల్లో 16 శాతం మంది 8వ తరగతి నుంచి ఇంటర్ వరకూ చదివిన వారున్నారు. 50 శాతం మంది డిగ్రీ చేశారు. 23 శాతం మంది పీజీ చేశారు. 10 శాతం మంది డాక్టరేట్ కూడా చేశారు. ఎంపీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో తమపై క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నట్లు 26 శాతం మంది తెలిపారు. ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ - ADR జరిపిన పరిశీలనలో ఈ విషయం తెలిసింది. మొత్తం 62 మంది ఎంపీలు రాజ్యసభకు కొత్తగా ఎన్నికయ్యారు. వారిలో 16 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 11 మందిపై తీవ్ర కేసులున్నాయి. తీవ్ర అంటే... హత్య, హత్యాయత్నం, రేప్, దోపిడీ, చోరీ అలాంటివి.
ఆస్తుల విషయానికి వస్తే... 52 మంది ఎంపీలు లేదా 84 శాతం మంది కోటీశ్వరులు. అత్యధిక ఆస్తులు ఉన్న అల్లా అయోధ్య రామిరెడ్డి, కార్పొరేట్ ప్రముఖుడు పరిమల్ నత్వానీ... వీరిద్దరూ వైసీపీ తరపున ఏపీలో ఎంపీలు. వారి ఆస్తుల్ని రూ.2577 కోట్లు అని రూ.396 కోట్లు అని అఫిడవిట్లలో తెలిపారు. ఈ ఆస్తుల లిస్టులో మూడోస్థానం మధ్యప్రదేశ్‌కి చెందిన బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింథియాది. ఆయన తనకు రూ.379 కోట్ల ఆస్తి ఉందని తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఎంపీల సగటు ఆస్తుల (యావరేజ్ అసెట్స్) విలువ రూ.74.04 కోట్లు. వైసీపీ నుంచి ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ ఆస్తుల విలువ రూ.4 కోట్లు ఉండగా... మరో సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆస్తుల విలువ కేవలం రూ. 32 లక్షలు.
కొత్త ఎంపీల్లో 52 శాతం మంది వయసు 61 నుంచి 90 ఏళ్ల దాకా ఉంది. 48 శాతం మంది వయసు 31 నుంచి 60 ఏళ్ల దాకా ఉంది. 62 మందిలో 8 మంది మాత్రమే మహిళలున్నారు.
రాజ్యసభలో ఏప్రిల్‌లో 55 ఎంపీ సీట్లు ఖాళీ అయ్యాయి. వెంటనే ఎన్నికలు జరపడానికి కరోనా అడ్డొచ్చింది. మరో 6 సీట్లు జూన్‌లో ఖాళీ అయ్యాయి. జూన్ 18, 19న ఎన్నిక జరిగింది. ఫలితాలు ప్రకటించాక... ఎవరి చిట్టా ఏంటి అన్నది బయటికొచ్చింది.
First published:
June 24, 2020, 11:00 AM IST