ఏదైనా పెద్ద ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు మత్తు మందు ఇస్తుంటారు. ఐతే కొన్ని సర్జరీలు చేసేటప్పుడు మత్తు మందు ఇవ్వరు. కేవలం ఆపరేషన్ చేసే భాగానికి మాత్రమే స్పర్శ లేకుండా చేస్తారు. ముఖ్యంగా మెదడుకు సంబంధించి ఆపరేషన్ చేసేటప్పుడు ఇలా చేస్తుంటారు. ఢిల్లీలో కూడా ఓ మహిళకు చికిత్స అందించారు. మెదడుకు ఆపరేషన్ చేస్తుండగా ఆమె మేల్కొనే ఉంది. అంతేకాదు హనుమాన్ చాలిసా చదువుతూ.. డాక్టర్లతో మాట్లాడుతూ.. మెదడుకు సర్జరీ చేయించుకుంది. దాదాపు 3 గంటల పాటు సాగిన ఆ ఆపరేషన్ విజయవంతమైంది. ఆ మహిళ ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది. ఢిల్లీ ఎయిమ్స్ వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం..యుక్తి అగర్వాల్ అనే 24 ఏళ్ల మహిళ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరింది. ఆపరేషన్ చేసి కణతిని తొలగించాలని చెప్పారు.
అనుకున్న సమయానికే ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేశారు. మత్తు మందు ఇవ్వకుండా కేవలం ఆపరేషన్ జరిగే మెదడు భాగానికి స్పర్శ లేకుండా చేశారు. దీనిని వైద్య పరిభాషలో ''అవేక్ క్రానియోటమైస్'' అని పిలుస్తారు. రోగి మేల్కొని ఉన్న సమయంలోనే సర్జరీ చేస్తారు. మెదడులో ఉన్న సున్నితమైన భాగాలు సరిగ్గా పనిచేస్తున్నాయా? అని తెలియాలంటే పేషెంట్ మేల్కొనే ఉండాలి. ఇలానే యుక్తి అగర్వాల్‌కు కూడా ఆపరేషన్ చేశారు. జులై 22న న్యూరో సర్జన్ డాక్టర్ దీపక్ గుప్తా నేతృత్వంలో విజయవంతగా కణతి తొలగించారు. ఆపరేషన్ సమయంలో మేల్కొని ఉన్న ఆ మహిళ.. హనుమాన్ చాలీసాను పఠించారు. అందులో ఉన్న మొత్తం 40 శ్లోకాలను ఆమె చదివారు. అంతేకాదు డాక్టర్లతో ముచ్చటిస్తూ ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
In #AIIMS, a woman patient recite 40 verses of #Hanuman chalisa, while @drdeepakguptans and his neuro anaesthetic team conducts brain tumor surgery.#Delhi pic.twitter.com/MmKTJsKo95
— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) July 23, 2021
ఢిల్లీ ఎయిమ్స్‌లో గత 20 ఏళ్లుగా ఇలాంటి ఆపరేషన్లు చేస్తున్నారు. గత ఏడాది లండన్‌లోనూ ఓ రోగి వయొలిన్ వాయిస్తుండగా సర్జరీ చేశారు. కింగ్స్ కాలేజీ ఆస్పత్రిలో 53 ఏళ్ల వ్యక్తి ఆపరేషన్ చేసి విజయవంతంగా కణతిని తొలగించారు. ఏపీలో ఓ వ్యక్తికి బాహుబలి సినిమా చూపిస్తూ వైద్య చికిత్స అందించిన ఘటనలను చూశాం. ఇటీవల తమిళనాడులో రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడిని బిగిల్ సినిమా చూపిస్తూ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. అతడి ఇంజెక్షన్ తీసుకోవడమంటే చాలా భయం. అందుకే తనకు ఎంతో ఇష్టమైన విజయ్ సినిమాను చూపించారు. అతడు సినిమాలో పూర్తిగా లీనమవగా..అదే సమయంలో డాక్టర్లు చికిత్స అందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, Medical Research, New Delhi