• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • 22 JAWANS DIED IN CHHATTISGARH ENCOUNTER 31 JAWANS HAVING SEVIOUR INJURIES OFFICIAL STATEMENT RELEASED HSN

Chhattisgarh Encounter: పచ్చని అడవిలో రక్తపుధారలు.. శవాల గుట్టలు.. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ ఘటనలో మొత్తం 22 మంది జవాన్లు మృతి

మరణించిన జవాన్ ను మోసుకెళ్తున్న తోటి జవాన్లు

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ ఘటనలో మరణించిన జవాన్ల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా వెల్లడించారు. మరో 21 మంది జవాన్లు కనిపించకుండా పోవడంతో కలకలం రేకెత్తిస్తోంది.

  • Share this:
    పక్షుల కిలకిలలు వినిపించాల్సిన అడవి కాస్తా తుపాకీ తూటాల శబ్దంతో దద్దరిల్లిపోయింది. పచ్చని చెట్లపై ఎర్రెర్రటి రక్తపు ధారలు.. ఎటు చూసినా రక్తపు మరకలు. ఒక్కొక్కటిగా బయటపడుతున్న మృతదేహాల ఆనవాళ్లు. చత్తీస్ ఘడ్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్లో కనిపించిన దృశ్యాలివి. బీజాపూర్ జిల్లాలో శనివారం మావోయిస్టులకు, జవాన్లకు మధ్య కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. మావోయిస్టుల కదలికలపై కీలక సమాచారం అందుకున్న భద్రతా బలగాలు శనివారం పెద్ద సంఖ్యలో అడవుల్లోకి వెళ్లాయి. అనుకున్న ప్రాంతానికి వెళ్లగానే వారికి మావోయిస్టులు కనిపించారు. మొదటగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత జవాన్లు కూడా ఎదురుకాల్పులు జరిపారు. తూపాకీ తూటాల మోతతో ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది.

    ఈ ఎన్ కౌంటర్లో మొదటగా ఐదుగురు జవాన్లు ప్రాణాలు వదిలారు. దాదాపు 31 మంది జవాన్లు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తమై తరలించారు. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉండగా, తాజాగా మరో 17 మంది జవాన్ల మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో మొత్తం మీద 22 మంది జవాన్లు ఈ ఘటనలో మరణించారని అధికారికంగా వెల్లడించారు. గాయపడిన వారికి బీజాపూర్, రాయ్ పూర్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

    ఇదే సమయంలో ఈ ప్రత్యేక ఎన్ కౌంటర్ ఆపరేషన్లో పాల్గొన్న మరో 21 మంది వరకు జవాన్లు కనిపించడం లేదని తెలియడంతో ప్రత్యేక బృందాలు అడవిలో అన్వేషణ ప్రారంభించాయి. వారి ఆచూకీని తెలుసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అడవిని జల్లెడపడుతున్నారు. గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ దారుణ ఘటన నేపథ్యంలో సీఆర్పీఎఫ్ డీజీ కులదీప్ సింగ్ ఆదివారం ఉదయం ఛత్తీస్ గఢ్ కు చేరుకున్నారు. ఎన్ కౌంటర్ కు సంబంధించిన అన్ని వివరాలను ఆయన ఆరా తీశారు. మావోయిస్టులు దాదాపు 100 మంది వరకు ఉండవచ్చుననీ, వారి వైపు కూడా ప్రాణనష్టం అధికంగానే ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. ఘటన గురించి ఆరా తీశారు. జవాన్లకు మెరుగైన చికిత్స అందేలా చూడాలన్నారు.
    Published by:Hasaan Kandula
    First published: