PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ చివరిసారిగా 2019 నవంబర్లో బ్రెజిల్ వెళ్లారు. ఆ తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లకపోయినా ప్రధాని మోదీ దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించారు.
2020 సంవత్సరం. ప్రధానిగా నరేంద్ర మోదీకి ఓ అరుదైన జ్ఞాపకాన్ని అందించింది. కరోనా వల్ల ఈ సంవత్సరం ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క విదేశీ పర్యటనకు కూడా వెళ్లలేదు. 2014లో ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నరేంద్ర మోదీ ప్రతి సంవత్సరం విదేశీ పర్యటనలకు వెళ్లారు. ప్రధానమంత్రి ఆఫీసు అధికారిక వెబ్ సైట్ (పీఎంఓ) అందించిన రిపోర్టు ప్రకారం నవంబర్ 22 నాటి వరకు ఈ ఏడాది మోదీ ఒక్క విదేశీ పర్యటనకు కూడా వెళ్లలేదు. డిసెంబర్ 31 వరకు ఆయన విదేశీ పర్యటన ఉండకపోవచ్చే వాదన ఉంది. ప్రధాని మోదీ చివరిసారిగా 2019 నవంబర్లో బ్రెజిల్ వెళ్లారు. అయితే, విదేశాలకు వెళ్లకపోయినా ప్రధాని మోదీ దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించారు. ఇటీవల బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి హాజరయ్యారు. ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్యలో రామాలయం భూమిపూజకు హాజరయ్యారు.
ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున విదేశీ పర్యటనలు చేసే ప్రధాని మోదీ ఈ ఏడాది ఒక్క ఫారెన్ టూర్కు కూడా వెళ్లకపోవడం విశేషం. పీఎంఓ డేటా ప్రకారం 2014 జూన్ 15 నుంచి 2019 నవంబర్ నాటికి ప్రధాని నరేంద్ర మోదీ 96 దేశాల్లో పర్యటించారు. 2014లో ఎనిమిది, 2015లో 23, 2016లో 17, 2017లో 14, 2018లో 20, 2019లో 14 దేశాల్లో పర్యటించారు.