కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తున్నది. బ్రిటన్ లో భారీగా కేసులు, మరణాలు చోటుచేసుకుంటుండగా, అమెరికాలోనూ తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. ఇటు భారత్ లోనూ ఒమిక్రాన్ విజృంభణ కొనసాగుతున్నది. దేశంలో ఇప్పటిదాకా నమోదైన ఒమిక్రాన్ కేసులు 200 మార్కును చేరాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం నాడు వెల్లడించింది. దేశంలో ఇప్పటిదాకా 12 రాష్ట్రాలకు కొత్త మహమ్మారి విస్తరించింది. ప్రధానంగా ఏడు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉంటే, అందులో రెండు రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. క్రిస్మస్ పండుగ, న్యూ ఇయర్ వేడుకల్లో ఒమిక్రాన్ మరింత వ్యాపించే అవకాశాలుండటంతో ఎక్కడికక్కడే ఆంక్షలు విధిస్తున్నారు. ఒమిక్రాన్ కేసులపై కేంద్రం చెప్పిన వివరాలివి..
దేశంలో ఇప్పటి వరకు 200 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 54, ఢిల్లీలో 54 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఆ తర్వాత తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్లో 18, కేరళలో 15, గుజరాత్లో 14, ఉత్తరప్రదేశ్లో 2, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్క కేసు నమోదైనట్లు చెప్పింది. సోమవారం వరకు దేశంలో 174గా ఉన్న కేసులు ఒక్కరోజులోనే 200 మార్కును చేరడం గమనార్హం.
మొత్తం 200 ఒమిక్రాన్ కేసుల్లో ఇప్పటికే కొందరు కోలుకున్నారు. మహారాష్ట్రలో 28 మంది, ఢిల్లీలో 12 మంది, కర్ణాటకలో 15 మంది, రాజస్థాన్లో 18, ఉత్తరప్రదేశ్, ఏపీ, బెంగాల్లో బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది.
అయితే, తెలంగాణలో నమోదైన 20 కేసుల్లో ఇప్పటిదాకా ఒక్కరు కూడా కోలుకోలేదు. వాళ్లలో నలుగురి ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, తెలంగాణలో ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉండి, దేశంలోనే అత్యధిక కేసుల జాబితాలో టాప్-3వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేవ్ లో మాత్రం ఇప్పటిదాకా ఒక్క కేసు మాత్రమే నమోదైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid, India, Omicron, Omicron corona variant, Telangana