హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Vidhi Jadav: అమర జవాన్ల కుటుంబాలకు బాసటగా 20 ఏళ్ల యువతి.. ఇంటింటికీ వెళ్లి

Vidhi Jadav: అమర జవాన్ల కుటుంబాలకు బాసటగా 20 ఏళ్ల యువతి.. ఇంటింటికీ వెళ్లి

అమర జవాన్ కుటుంబాలకు యువతి సాయం

అమర జవాన్ కుటుంబాలకు యువతి సాయం

Vidhi Jadav: గుజరాత్‌లోని నదియాడ్‌కు చెందిన 20 ఏళ్ల విధి జాదవ్... విధి నిర్వహణలో మరణించిన 153 మంది సైనికుల కుటుంబాలను పరామర్శించింది. వారికి ఆర్థిక సాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Vidhi Jadav: ఏదైనా ప్రమాదంలో భారత సైనికులు ప్రాణాలు కోల్పోతే యావత్‌ దేశం బాధపడుతుంది. ప్రత్యేకంగా నివాళులర్పిస్తుంది. కానీ ఆ సైనికుల కుటుంబాల గురించి ఆలోచించే వారు చాలా తక్కువ. ఆ కుటుంబాలను కలిసి ఓదార్చి, వీలైనంత సాయం చేసే వారు మరీ అరుదు. కానీ ఓ 20 ఏళ్ల విద్యార్థిని వివిధ రాష్ట్రాల్లోని అమర జవాన్ల కుటుంబాలను నేరుగా వెళ్లి కలుస్తోంది. నిరుపేద కుటుంబాలకు తన వంతు సాయం చేసి, ఓదార్పు అందిస్తోంది. చిన్నతనం నుంచే ఆమె సైనిక కుటుంబాలకు తోడ్పాటు ఇస్తోంది.. భవిష్యత్తులోనూ కొనసాగిస్తానని తెలిపింది. ఆ విద్యార్థిని ఎవరు.. ఆమె విశేషాలు.. ఏంటో ఇప్పుడు చూద్దాం.

153 కుటుంబాలను కలిసిన విధి

గుజరాత్‌లోని నదియాడ్‌కు చెందిన 20 ఏళ్ల కళాశాల విద్యార్థిని విధి జాదవ్. ఆమె ఇప్పటివరకు విధి నిర్వహణలో మరణించిన 153 మంది సైనికుల కుటుంబాలను పరామర్శించింది. అంతే కాకుండా అమరవీరుల సైనికుల కుటుంబాలలో ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి ఆర్థిక సాయం కూడా చేసింది. ఇటీవల సిక్కింలో సైనికులు ప్రయాణిస్తున్న వాహనం మలుపులో అదుపుతప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 16 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు గాయపడ్డారు. ఛట్టెన్‌ నుంచి థంగు ప్రాంతంలోని బోర్డర్‌ పోస్ట్‌లకు బయలుదేరిన ఆర్మీ కాన్వాయ్‌లోని మూడు వాహనాలలో ఒకటి ప్రమాదానికి గురైంది. విధి జాదవ్ ఐదుగురు అమర జవాన్ల కుటుంబాలకు రూ.5,000 మొత్తాన్ని పంపింది. అలాగే అందరికీ ఓదారుస్తూ లేఖలు రాసింది. అంతే కాకుండా వేసవి సెలవుల్లో ఆ కుటుంబాలను ప్రత్యక్షంగా కలిసి రావాలని భావిస్తోంది.

 ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది

విధి నిర్వహణలో మరణించిన ఆర్థికంగా బలహీనంగా ఉన్న సైనికుల కుటుంబాలకు సహాయం చేస్తూనే ఉంటానని విధి చెప్పింది. అమరవీరుల సైనికుల కుటుంబాల్లో కొందరు నిరుపేదలు ఉన్నారని తెలిపింది. నేను కేవలం ఆ కుటుంబాలకు చేయూత ఇవ్వాలనే తన వంతు సాయం చేస్తున్నానని పేర్కొంది. విధి తండ్రి రాజేంద్ర జాదవ్, నదియాడ్‌లో మామ్‌లత్‌దార్‌గా పనిచేస్తున్నారు. విధి 6వ తరగతిలో ఉన్నప్పటి నుంచి అమరవీరుల సైనికుల కుటుంబాలను సందర్శించడం ప్రారంభించిందని ఆయన చెప్పారు. విధి 2014లో ఖేడా జిల్లాలోని థాస్రాలో అమరులైన సైనికుడి అంత్యక్రియలకు హాజరైందని, వాటి ఇంటిని సందర్శించిందని, అప్పటి నుంచి ఆమె దేశంలోని అనేక రాష్ట్రాలకు వెళ్లి అమరవీరుల కుటుంబాలను ఓదార్చిందని రాజేంద్ర జాదవ్‌ తెలిపారు. ఇవ్వగలిగినంత ఆర్థిక సాయం చేసిందని అన్నారు.

ముందుకొస్తున్న దాతలు

ఆనంద్‌లోని కళాశాలలో విధి పొలిటికల్‌ సైన్స్‌, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ చదువుతోంది. ఆమె ఇప్పటివరకు ఢిల్లీ, పంజాబ్ , హర్యానా , ఉత్తరాఖండ్ , రాజస్థాన్‌లో పర్యటించి, అమర జవాన్లు కుటుంబాలను కలుసుకొంది. మొదటి నుంచి వివిధ రాష్ట్రాలకు ఆమె ప్రయాణ ఖర్చులు, నిరుపేద జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడానికి రాజేంద్ర జాదవ్‌ డబ్బు ఇచ్చేవారు. అయితే కొంతకాలంగా విధి సేవలను ప్రోత్సహిస్తూ కొందరు దాతలు ముందుకు వస్తున్నారు. సైనికుల కుటుంబాలకు ఉపయోగపడేలా నగదు ఇస్తున్నారు.

First published:

Tags: Gujarat, Indian Army

ఉత్తమ కథలు