Surgery: చిన్నపిల్లలు డబ్బులు దాచుకునే హుండీ లను పగులగొడితే.. చిల్లర నాణేలు బయటపడినట్లు.. ఓ వ్యక్తి కడుపులో పెద్ద సంఖ్యలో నాణేలు కనిపించాయి. అదెలాగా? అని ఆశ్చర్యపోకండి.. అతనికి విచిత్రంగా నాణేలు మింగే అలవాటు ఉంది. మీరు విన్నది నిజమే ఇప్పటి వరకు అతను రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నాణేలు మింగేశాడు. ఇవన్నీ కడుపులో అలా ఉండిపోయాయి. ఒకటిన్నర కేజీకి చేరుకున్నాయి. చివరికి డాక్టర్లు ఆపరేషన్ చేసి అతని కడుపులో నుంచి మొత్తం 187 నాణేలను బయటకి తీశారు. ఆశ్చర్యపరిచే ఈ సంఘటన మన పక్క రాష్ట్రం కర్ణాటకలో జరిగింది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
విపరీతమైన కడుపునొప్పితో ఆస్పత్రికి
కర్ణాటక , రాయచూర్ జిల్లా లింగసుగూర్‌కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి దయమప్ప హరిజన్. కొన్ని రోజులుగా ఈ నాణేలు మింగే డిజార్డర్‌తో బాధపడుతున్నాడు. దీంతో ఇతని కడుపులోకి పెద్ద ఎత్తున నాణేలు చేరుకున్నాయి. పొత్తికడుపు ప్రాంతంలో విపరీతంగా నొప్పిగా ఉందని ఆస్పత్రికి రావడంతో అతనికి ఎక్స్‌రే, ఎండోస్కోప్‌లు చేశారు. టెస్ట్‌లలో అతని కడుపులో నాణేలు ఉన్నట్లు తెలిసింది. దీంతో అతన్ని కాపాడేందుకు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. దీని గురించి డాక్టర్ ఈశ్వర్ కల్బుర్గి మాట్లాడుతూ.. విపరీతంగా కడుపు నొప్పితో బాధ పడుతున్న దయమప్ప హరిజన్‌ను బంధువులు ఆస్పత్రికి తీసుకుని వచ్చారని చెప్పారు. అతను గత కొద్ది నెలలుగా ఈ డిజార్డర్‌తో బాధ పడుతున్నట్లు గుర్తించామన్నారు. రిపోర్టులు చూసి ఆశ్చర్యపోయామని, కడుపులో పెద్ద సంఖ్యలో నాణేలు ఉన్నాయని తెలిపారు. విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి అతని కడుపు నుంచి నాణేలు తొలగించామని వివరించారు.
ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం
ఎస్ నిజలింగప్ప మెడికల్ కాలేజీ, హనగల్ కుమారేశ్వర్ ఆసుపత్రికి చెందిన వైద్యుల బృదం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ డాక్టర్ల బృందంలో డాక్టర్ ఈశ్వర్ కల్బుర్గి, డాక్టర్ ప్రకాష్ కట్టి మణితోపాటు అర్చన, రూపల్ హలకుండే అనే ఇద్దరు అనస్తీషియా డాక్టర్లు పాల్గొన్నారు. పొట్టలో నుంచి నాణేలను బయటకు తీసి అవి ఎంత ఉన్నాయో లెక్క పెట్టారు. ఆ నాణేలలో ఐదు రూపాయల నాణేలు 56, రెండు రూపాయల నాణేలు 51, రూపాయి నాణేలు 80 చొప్పున ఉన్నాయి. ఇవి మొత్తం కలిపి ఒకటిన్నర కిలోల బరువు ఉన్నాయని తెలిపారు. ఈ ఆపరేషన్ తర్వాత ఇప్పుడు బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Covid Is Back : కోవిడ్ ఈజ్ బ్యాక్..చైనాలో రోజుకి 40వేల చొప్పున నమోదవుతున్న కేసులు
మధ్యప్రదేశ్‌లో గాజులు మింగిన లాయర్
రెండు మూడేళ్ల క్రితం కూడా ఇలాంటిదే ఓ వార్త వెలుగులోకి వచ్చింది. మధ్య ప్రదేశ్‌కు చెందిన ఓ లాయర్ చిప్స్ తిన్నంత సులువుగా గాజు ముక్కలు తినేసేవారు. అప్పట్లో అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది. మధ్య ప్రదేశ్‌కు చెందిన దయారామ్ సాహు అనే ఆయన చాలా కాలంగా గాజు ముక్కలు తినడానికి బానిస అయ్యాడు. వైద్యపరంగా ఈ రుగ్మతను హైలోఫాగియా అని పిలుస్తారు. దీనితో బాధ పడుతున్న వారు గాజు ముక్కలలాంటి వాటిని నమలాలనే కోరికతో ఉంటారని వైద్యులు తెలిపారు. అది ఎంతో ప్రమాదం అని తెలిసినా కూడా వారు అలాగే తినేందుకు ఆసక్తి చూపుతారని చెప్పారు. దీంతో అప్పట్లో ఈ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు ఈ దయమప్ప సంగతీ ఇలాగే విస్మయం కలిగిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karnataka