Bridge Collapses : గుజరాత్లో బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఆదివారం నాడు (అక్టోబర్ 30న), రాష్ట్రంలో బ్రిటిష్ కాలం నాటి కేబుల్ బ్రిడ్జి (Cable Bridge) కుప్పకూలిన విషయం తెలిసిందే. మోర్బీ నగరంలోని మచ్చు నదిపై నిర్మించిన ఈ వంతెన కూలిపోవడంతో ఈరోజు ఉదయం నాటికి చనిపోయిన వారి సంఖ్య 141కు చేరిందని గుజరాత్ (Gujarat) హోంమంత్రి హర్ష్ సంఘ్వీ వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, దుర్ఘటన జరిగినప్పుడు తీగల వంతెనపై ఐదు వందల మంది ఉండగా.. కొందరు యువకులు కావాలనే దీనిని ఊపారు. దాంతో ఒక్కసారిగా ఆ కేబుల్ బ్రిడ్జి కూలిపోగా.. క్షణాల్లోనే వందల మంది నది నీటిలో పడి గల్లంతయ్యారు. కాగా ఇప్పటివరకు చనిపోయిన వారిలో చిన్న పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఈ ఘటనపై చాలామంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా దుర్ఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కోల్‌కతా: 2016లో 26 మంది మరణం
2016, మార్చి 31న కోల్‌కతాలోని గిరీష్ పార్క్ పరిసరాల్లో నిర్మాణంలో ఉన్న వివేకానంద రోడ్ ఫ్లైఓవర్ స్టీల్ స్పాన్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. భారీ కాంక్రీట్ స్లాబ్‌లు, మెటల్ కింద నుంచి దాదాపు 100 మంది క్షతగాత్రులను రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు.
అరుణాచల్ ప్రదేశ్: 2011లో 30 మంది మరణం
2011లో అరుణాచల్ ప్రదేశ్‌లోని నదిపై ఫుట్‌బ్రిడ్జి కుప్ప కూలింది. ఈ ఘటనలో 30 మంది చనిపోయారు.
డార్జిలింగ్: 2011లో 32 మంది మృతి
2011లో డార్జిలింగ్‌లోని హిల్ టౌన్‌కి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బ్రిడ్జి కూలిపోయింది. ఫెస్టివల్ సీజన్ వల్ల ఎక్కువ మంది జనాలతో నిండిపోయిన ఈ వంతెన కుప్పకూలింది. ఈ ఇన్సిడెంట్లో కనీసం 32 మంది చనిపోయారు. ఇదొక ఓల్డ్ ఫుట్‌బ్రిడ్జి కాగా.. ఇది కూలినప్పుడు 60 మందికి పైగా గాయపడ్డారు.
బీహార్: 2006లో 34 మంది మృత్యువాత
డిసెంబర్ 2006లో బిహార్‌లోని రైల్వే స్టేషన్లో ప్యాసింజర్ ట్రైన్‌పై 150 ఏళ్ల నాటి బ్రిడ్జి కూలిపోవడంతో కనీసం 34 మంది మరణించారు.
రోజూ వైన్ షాపుకి వెళ్లి మందు కొడుతున్న కోతి.. బాటిల్ ఇవ్వకుంటే రచ్చ రంభోలా
ముంబై: 2003లో కనీసం 20 మంది మరణం
2003, ఆగస్టు నెలలో ముంబై సమీపంలో ఒక వంతెన నదిలో పడిపోవడంతో 19 మంది పిల్లలతో సహా కనీసం 20 మంది మరణించారు.
చైనా
2007, ఆగస్టులో సెంట్రల్ హునాన్ ప్రావిన్స్‌లో నిర్మాణంలో ఉన్న ఒక నది వంతెన కూలిపోయింది. అప్పుడు కనీసం 64 మంది కార్మికులు మరణించారు.
నేపాల్
2007లో నేపాల్‌లోని రాజధాని ఖాట్మండుకు పశ్చిమాన 380 కి.మీ దూరంలోని భేరీ నదిపై ఉన్న ఓ వంతెన కూలిపోవడంతో కనీసం 16 మంది మరణించారు. 25 మంది తప్పిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపై దాదాపు 400 మంది ఉన్నట్లు సమాచారం. దాదాపు 100 మంది వరకు ఈత కొట్టి సురక్షితంగా బయటపడ్డారు.
పాకిస్థాన్: 2006లో కనీసం 40 మంది మృతి
2006, ఆగస్టులో పాకిస్థాన్‌లో వర్షాల కారణంగా పెషావర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్దాన్‌లో వంతెన కొట్టుకుపోయింది. దీనివల్ల 40 మంది మరణించారు.
బొలీవియా: 2003లో కనీసం 29 మంది
2003, డిసెంబర్లో బొలీవియాలో ఒక బస్సు రోడ్డు వంతెనను దాటుతుండగా ఆ వంతెన వరదలకు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో కనీసం 29 మంది మరణించారు.
మెక్సికో: 2021లో సిటీలో 26 మంది మృతి
గతేడాది మే నెలలో మెక్సికో సిటీ మెట్రో సిస్టమ్‌లోని ఎలివేటెడ్ ట్రాక్ కూలిపోయింది. ఒక ప్యాసింజర్ రైలు ఆ రైల్వే లైన్‌పై వెళ్తుండగా అది ఒక్కసారిగా కింద పడిపోయింది. ఈ దుర్ఘటనలో 26 మంది మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Gujarat