సమాజహితం కోసం వరకట్నం అనే విష సంస్కృతిని రూపుమాపడం కోసం నారాయణ్ సేవా సంస్థాన్ (NSS) అనే ఒక స్వచ్ఛంద సంస్థ విశేషంగా పాటుపడుతున్నది. తాజాగా ఆ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సామూహిక వివాహ వేడుకల్లో 11 మంది దివ్యాంగ జంటలు ఒక్కటైన ఘటన రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో చోటు చేసుకుంది. కొత్తగా ఒక్కటైన దంపతులందరూ కట్నం తీసుకోవద్దని ప్రచారం చేస్తూ ప్రమాణం చేయడం విశేషం. COVID-19 ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ వారు ఈ వేడుకలకు హాజరయ్యారు. నారాయణ్ సేవా సంస్థాన్ సంస్థ దివ్యాంగులు, వెనుకబడిన వర్గాల బాగోగుల కోసం కృషి చేస్తోంది. తాజాగా దివ్యాంగుల కోసమే ప్రత్యేకంగా సామూహిక వివాహ వేడుకలు ఏర్పాటు చేసినట్లు ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు.
ఎంతోమంది తల్లిదండ్రులకు భారంగా మారుతున్న వరకట్నం సంస్కృతిని రూపుమాపాలని ఈ సంస్థ ప్రచారం చేస్తున్నది. కట్నం తీసుకోకూడదని, తాము కూడా కట్నం తీసుకోవట్లేదని తాజాగా ఒక్కటైన 11 దివ్యాంగ జంటలూ ప్రమాణం చేశాయి. COVID-19 నేపథ్యంలో మాస్కులు ధరించాలని, ప్రభుత్వం నిర్దేశించిన ఇతర మార్గదర్శకాలను పాటించాలని వారు ప్రమాణం చేశారు. తమతో పాటు ప్రజలంతా వీటికి కట్టుబడి ఉండాలని కోరారు.
ఎంతోమందికి ఆసరాగా..
వైకల్యం అనేది కేవలం శారీరక సమస్యే కానీ, అనారోగ్యం కాదని వేడుకల్లో పాల్గొన్న కమలేశ్ అనే వ్యక్తి చెబుతున్నారు. ఆయన తోటి దివ్యాంగురాలైన పూజ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అతడికి మూడేళ్ల వయసులో పోలియో వచ్చింది. ఆపరేషన్ తరువాత పరికరాల సహాయంతో నడవగలిగాడు. అంగవైకల్యం తనకు ఎక్కడా ఒక సమస్యలా అనిపించలేదని అతడు చెప్పాడు. బాగా చదువుకొని పంచాయతీ అసిస్టెంట్ ఉద్యోగం కూడా సంపాదించాడు. కమలేశ్ పెళ్లి చేసుకున్న పూజకు ఒక ప్రమాదంలో కాలు తీసివేయాల్సి వచ్చింది. అనంతరం ఆమె కోలుకోవడానికి ఆపరేష్లను చేయాలని, అందుకు చాలా ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. కానీ ఎన్ఎస్ఎస్ సంస్థ పూజకు ఉచితంగా ఆపరేషన్ చేయించింది. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కమలేశ్‌ను జీవిత భాగస్వామిగా చేసుకోవడం సంతోషంగా ఉందని ఆమె చెబుతున్నారు. ఇలాంటి ఎంతోమంది దివ్యాంగులకు ఎన్ఎస్ఎస్ సంస్థ ఒక్కటి చేసింది.
18ఏళ్లుగా ప్రచారం...
కట్నం తీసుకోవద్దని 18 సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నట్లు నారాయణ్ సేవా సంస్థాన్ అధ్యక్షుడు ప్రశాంత్ అగర్వాల్ చెప్పారు. ఇప్పటి వరకు తమ సంస్థ ఆధ్వర్యంలో 2098 జంటలు ఒక్కటయ్యాయని, వారంతా జీవితంలో స్థిరపడినవారేనని ఆయన తెలిపారు. కరోనావైరస్ కారణంగా పెళ్లిచేసుకున్న వారి బంధువులు, NSS సంస్థకు చెందిన కొంతమంది సభ్యులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నూతన దంపతులకు ఎన్ఎస్ఎస్ ప్రతినిధులు గృహోపకరణాలను బహుమతిగా ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dowry, Dowry harassment, Rajasthan, Wedding