అవును.. నమ్మడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు అల్లు అర్జున్ దారిలోనే నితిన్ వెళ్తున్నాడు. అసలు ఈ ఇద్దరు హీరోలకు ఎక్కడ కుదిరింది అనే అనుమానం రావచ్చు కానీ ఇప్పుడు ఇదే జరుగుతుంది మరి. అల వైకుంఠపురములో సినిమాతో ఏడాదిన్నర తర్వాత వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు బన్నీ. బ్లాక్‌బస్టర్ కూడా కాదు.. దాని అమ్మమొగుడు లాంటి సినిమా తీసుకొచ్చాడు ప్రేక్షకుల ముందుకు. తీసుకుంటే తీసుకున్నావ్ కానీ అన్నా అదిరిపోయే సినిమాతో వచ్చావుపో అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఖుషీ అయిపోయారు. అలాంటి సినిమాతో రావాలనే నా పేరు సూర్య తర్వాత గ్యాప్ తీసుకున్నానని చెప్పాడు బన్నీ.
ఇప్పుడు నితిన్ కూడా ఇదే చేస్తున్నాడు. శ్రీనివాస కళ్యాణం డిజాస్టర్ తర్వాత ఏడాదిన్నరకు పైగానే గ్యాప్ తీసుకున్నాడు ఈ హీరో. 2019లో నితిన్ ఒక్క సినిమా కూడా చేయలేదు. పూర్తిగా స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత కానీ వెంకీ కుడుములకు ఓకే చెప్పలేదు ఈయన. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో వస్తున్న భీష్మ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఏడాదిన్నర గ్యాప్ తీసుకోడానికి కారణం కూడా మంచి కథ కోసమే అని చెబుతున్నాడు నితిన్. ఫిబ్రవరి 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది భీష్మ.
ఇక ప్రీమియర్స్ సందడి కూడా ఒకరోజు ముందుగానే మొదలు కానుంది. నితిన్ కచ్చితంగా ఈ చిత్రంతో హిట్ కొడతాడని అభిమానులు కూడా నమ్ముతున్నారు. ఈ చిత్ర బిజినెస్ కూడా ఆయన కెరీర్‌లోనే హైయ్యస్ట్ రేంజ్‌లో జరిగింది. 23.50 కోట్ల వరకు ఈ చిత్రాన్ని బిజినెస్ చేసారు దర్శక నిర్మాతలు. భీష్మ ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకుంటే.. నైజాం 6.30 కోట్లు.. సీడెడ్ 3.06 కోట్లు.. యుఎ 1.85 కోట్లు... గుంటూరు 1.55 కోట్లు.. ఈస్ట్ 1.55 కోట్లు.. కృష్ణ 1.40 కోట్లు.. వెస్ట్ 1.20 కోట్లు.. నెల్లూరు 0.64 కోట్లు.. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 17.50 కోట్ల వరకు ఈ చిత్ర బిజినెస్ జరిగింది.
ఇక రెస్టాఫ్ ఇండియా 2 కోట్లు... ఓవర్సీస్ 2.40 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా 23.50 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే ఇప్పుడు నితిన్ దాదాపు 25 కోట్ల వరకు షేర్ తీసుకొస్తే కానీ భీష్మ హిట్ అనిపించుకోదు. ఫ్లాపుల్లో ఉన్న నితిన్‌కు ఇది కాస్త కష్టమే కానీ పాజిటివ్ టాక్ వస్తే సినిమాపై ఉన్న అంచనాలకు.. విడుదలవుతున్న రేంజ్‌కు అది పెద్ద విషయమే కాదు. పైగా శివరాత్రి సెలవు రోజు కావడం.. మూడు రోజుల వీకెండ్ రావడంతో నితిన్ భీష్మతో కుమ్మేస్తాడని నమ్ముతున్నారు బయ్యర్లు కూడా. చూడాలిక మరి ఏం జరుగుతుందో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, Bheeshma, Nithiin, Telugu Cinema, Tollywood