సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలుబడనున్నాయి. ఈ ఎన్నికలు ముఖ్యంగా పలువురు తెలుగు సినీ నటులకు జీవన్మరణ సమస్యగా మారాయి. అంతేకాదు ఈ ఎలక్షన్లో గెలవకపోతే ఇక వారి రాజకీయ భవిష్యత్తు దాదాపు సమాధి అన్నట్టే ఉంది పరిస్థితి. గత ఎన్నికల్లో హిందూపురం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు నందమూరి బాలకృష్ణ. ఈ ఎన్నికల్లో కూడా హిందూపురం నుంచి మరోసారి బరిలో దిగారు. ఈ ఎన్నికలు అటు బాలకృష్ణతో పాటు టీడీపీకి అత్యంత కీలకం అనే చెప్పాలి. ఒకవేళ బాలయ్య గెలిచి..టీడీపీ అధికారంలోకి వస్తే..ఈ సారి బాలయ్యకు క్యాబినేట్ బెర్త్ ఖాయం అని తెలుగు దేశం వర్గాలు చెబుతున్నాయి. ఇక రోజా విషయానికొస్తే..గత ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా మొదటి సారి అసెంబ్లీలో అడుగుపెట్టింది. గతంలో రెండు సార్లు ఇదే నియోజకవర్గంలో పోటీ చేసినా విజయం మాత్రం రోజాను వరించలేదు. ఇపుడు అదే ‘నగరి’ నుంచి ఎమ్మెల్యేగా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఒక వేళ ఈ ఎన్నికల్లో రోజా గెలిచి..వైసీపీ అధికారంలోకి వస్తే..రోజాకు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో కీలక మంత్రి పదవి దక్కనుందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

బాలకృష్ణ,రోజా
ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. గత ఎన్నికల ముందు జనసేన పార్టీ పెట్టినా ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ,టీడీపీ కూటమి మద్దతు ఇచ్చారు. ఇపుడు ఫస్ట్ టైమ్ సార్వత్రిక సమరంలో కమ్యూనిస్టులు, బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. అంతేకాదు ఏపీలోని గాజువాక నియోజకవర్గంతో పాటు భీమవరం నుంచి ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీకి దిగారు. ఈ ఎన్నికల్లో గెలుపు అనేది జనసేనానికి చాలా కీలకం. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో పవన్ ఓడిపోయిన ఆ ఎఫెక్ట్ జనసేన పార్టీపై ఖచ్చితంగా ఉంటుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ రెండో అన్న నాగబాబు కూడా నర్సాపురం నుంచి మొదటిసారి ఎంపీగా పోటీ చేసారు. ఆయన ఎంపీగా గెలిచేది లేనిది మరికొన్ని గంటల్లో తేలనుంది.

పవన్ కళ్యాణ్, నాగబాబు (File)
వీళ్లతో పాటు చిత్తూరు ఎంపీగా టీడీపీ తరుపున మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు శివప్రసాద్. సినిమాల్లో సరైన వేశాలు దొరకని శివ ప్రసాద్.. పార్లమెంట్లో రకరకాల వేషాలతో మెప్పించడం కొసమెరుపు. ఇక ఒకప్పటి అందాల తార జయప్రద కూడా ఈ ఎన్నికల్లో రామ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తోంది. గతంలో ఒక సారి రాజ్యసభ, రెండు సార్లు ఎస్పీ తరుపున లోక్‌సభకు ఎన్నికయ్యారు. అటు మరో నటి సుమలత కూడా స్వతంత్య్ర అభ్యర్ధిగా మాండ్యా నుంచి ముఖ్యమంత్రి కుమారుడు నిఖిల్ గౌడకు మంచి పోటీ ఇచ్చారు. మరి వీళ్లలో ఎవరు గెలిచి అసెంబ్లీకి లోకసభకు వెళతారన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు ఓపిక పట్టాల్సిందే.