పెళ్లి తర్వాత సినిమాలు చేయొచ్చు.. చేసినా చూస్తారు అని సౌత్ ఇండస్ట్రీలో నిరూపించిన ఏకైక హీరోయిన్ ఈ మధ్య కాలంలో ఎవరైనా ఉన్నారా అంటే అది సమంత మాత్రమే. నాగ చైతన్యతో ఏడడుగులు నడిచిన తర్వాత కూడా ఈమెతో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికీ సినిమాకు కోట్లకు కోట్లు వసూలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. చేతినిండా సినిమాలతో రచ్చ చేస్తుంది సమంత అక్కినేని. ప్రస్తుతం తెలుగులో 96 సినిమా రీమేక్‌లో శర్వానంద్‌తో జోడీ కట్టింది సమంత. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తైపోయింది. ప్రస్తుతం ఢిల్లీలో ది ఫ్యామిలీ మెన్ 2 సీజన్ కోసం షూటింగ్ చేస్తుంది సమంత.
ఈ వెబ్ సిరీస్‌లో సమంత ప్రతినాయక పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది. కథలో చాలా కీలకమైన పాత్ర ఇది. మనోజ్ బాజ్‌పెయి, ప్రియమణి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ బ్లాక్ బస్టర్ అయింది. దాంతో ఇప్పుడు రెండో సీజన్ రెడీ చేస్తున్నారు దర్శక ద్వయం రాజ్ డికే. ఇక సమంతకు తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. పెళ్లికి ముందు నుంచి కూడా అక్కడ సినిమాలు చేయాలంటూ నిర్మాతలు కోరుతున్నారు. అయితే ఈమె మాత్రం ఎప్పుడూ సౌత్ దాటి వెళ్లలేదు. ఇప్పుడు కూడా హిందీలో ఓ సినిమా చేయాలని సమంతను అడుగుతున్నారు దర్శక నిర్మాతలు. సౌత్‌లో ఎంత క్రేజ్ ఉన్నా కూడా ఇప్పటికీ అనుష్క, నయనతార లాంటి వాళ్లు బాలీవుడ్ మొహం చూడలేదు.
సమంత కూడా అంతే. ఈ క్రమంలోనే యూ టర్న్ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని.. అందులో నటించాలంటూ దర్శక నిర్మాతలు అక్కినేని కోడలికి ఆఫర్ ఇచ్చినా కూడా సున్నితంగా తిరస్కరించిందని ప్రచారం జరుగుతుంది. దాంతో ఇప్పుడు ఇదే సినిమాను అక్కడ తాప్సీతో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకు మంచి టాక్ వచ్చినా కూడా విజయం సాధించలేదు యూ టర్న్. దానికితోడు హిందీలో నటించకూడదని ముందు నుంచి కూడా ఓ కట్టుబాటు పెట్టుకుంది కాబట్టి అక్కడికి వెళ్లట్లేదు సమంత. కారణమేదైనా కూడా బాలీవుడ్ ఆఫర్ అయితే వదిలేసుకుంది స్యామ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Samantha akkineni, Telugu Cinema, Tollywood